భారీ లక్ష్యాన్ని ఛేదించి భీమవరం బుల్స్

భారీ లక్ష్యాన్ని ఛేదించి భీమవరం బుల్స్

6 వికెట్ల తేడాతో రాయలసీమపై అద్భుత విజయం

విశాఖపట్నం, ఆంధ్రప్రభ: ఏపీఎల్ 2026 సీజన్ 5లో మూడవ రోజు రెండో మ్యాచ్‌లో భీమవరం బుల్స్ ఘన విజయం సాధించింది. రాయల్స్ ఆఫ్ రాయలసీమ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేజ్ చేసి 6 వికెట్ల తేడాతో గెలిచింది.

టాస్ గెలిచిన భీమవరం బుల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు దూకుడైన ఆరంభంతో తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఓపెనర్ రషీద్ 33 బంతుల్లో 55 పరుగులు (8 ఫోర్లు, 1 సిక్సర్), మరో ఓపెనర్ వంశీకృష్ణ 59 బంతుల్లో 107 పరుగులు (7 ఫోర్లు, 8 సిక్సర్లు)తో చెలరేగారు. జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. భీమవరం బౌలర్లలో యశ్వంత్ రెండు వికెట్లు తీశాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భీమవరం బుల్స్ పవర్‌ప్లేలోనే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రేవంత్ రెడ్డి 18 బంతుల్లో 44 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు), హేమంత్ రెడ్డి 26 బంతుల్లో 40 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సర్లు)తో శుభారంభం అందించారు.

మధ్యలో విగ్నేశ్వర్, రవికిరణ్, ప్రకాష్ కీలక భాగస్వామ్యాలు అందించడంతో భీమవరం బుల్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.

ఈ విజయంతో భీమవరం బుల్స్ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎం. రేవంత్ రెడ్డి ఎంపికయ్యాడు.