Chityala 110 మంది దళితులకు ఇండ్ల స్థలాలకు హద్దులు ఏర్పాటు
Chityala 110 మంది దళితులకు ఇండ్ల స్థలాలకు హద్దులు ఏర్పాటు
చిట్యాల (Chityala), ఆంధ్రప్రభ: మండల కేంద్రం శివారు సర్వే నంబర్ 162, 166లోని 5 ఎకరాల భూమిలో 110 మంది దళితులకు ఇండ్ల స్థలాలకు హద్దులు ఏర్పాటు చేసి రాళ్లు పాతారు. దీంతో ఏళ్లుగా నిలిచిపోయిన సమస్యకు పరిష్కారం లభించింది. 2005లో అప్పటి ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి లేఅవుట్ రూపొందించి 110 మంది దళితులకు ప్లాట్లు, పట్టాలు పంపిణీ చేసింది. అయితే భూస్వాములతో వివాదాలు, కోర్టు కేసుల కారణంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు.
ఈ సమస్యను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లగా, ఆయన అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌తో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో గురువారం చిట్యాల తహసీల్దార్, మండల అధికారులు కలిసి భూమికి హద్దులు నిర్ణయించి రాళ్లు పాతారు. దీంతో 110 మంది దళిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, నాయకులు పుల్ల సమ్మయ్య, ధబ్బేట రవి, మాసు మల్లయ్య, పుల్ల శైలేందర్, పుల్ల రాయ నరసయ్య, గిన్నారపు రమేష్, కనకం సారయ్య, లద్దునూరి సాంబయ్య, దూడపాక సాంబయ్య, కనకం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
