కోతుల బెడద నివారణకు మున్సిపాలిటీ చర్యలు

కోతుల బెడద నివారణకు మున్సిపాలిటీ చర్యలు

-1,500 కోతులను అటవీ ప్రాంతాలకు తరలింపు

-కోతుల రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: చైర్‌పర్సన్ స్వప్న

మోత్కూర్, ఆంధ్రప్రభ:
మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య తెలిపారు. ప్రజలను కోతుల సమస్య నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా మున్సిపల్ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

సోమవారం ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 1, 2వ వార్డుల హైస్కూల్ ప్రాంతం, 6వ వార్డులోని ఆరేగూడెం, ఇందిరానగర్, పాత సినిమా టాకీస్ ప్రాంతం, 10వ వార్డులో ప్రభుత్వ ఆసుపత్రి వెనుక ప్రాంతాల్లో కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 1,500 కోతులను పట్టించి నాగార్జునసాగర్ పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. అలాగే కొండగడప, బుజిలాపురం, రాజన్నగూడెం, జామచెట్లబావి ప్రాంతాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని 12 వార్డుల్లో దశలవారీగా కోతులను పట్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

కోతుల బెడద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు మున్సిపల్ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని స్వప్న పేర్కొన్నారు. మోత్కూర్‌ను పూర్తిస్థాయిలో ‘కోతుల రహిత మున్సిపాలిటీ’గా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు.

Leave a Reply