Tollywood | కథ చెప్పారు.. బ్లాక్‌బస్టర్ కొట్టారు!
Tollywood | కథ చెప్పారు.. బ్లాక్‌బస్టర్ కొట్టారు!
- టాలీవుడ్‌లో హిట్ ఫార్ములా ఇదేనా?
- నరేషన్ మ్యాజిక్ తో బాక్సాఫీస్‌పై మాస్ ఇంపాక్ట్!
- కథ చెప్పే క్యారెక్టర్ ఉంటే హిట్ గ్యారంటీనా?
ఆంధ్రప్రభ : టాలీవుడ్ (Tollywood)లో సినీ ప్రేమికులకు కొదవలేదు. ఎలాంటి సినిమా వచ్చినా.. కంటెంట్ బాగుంటే తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు ఎన్నోసార్లు నిరూపించారు. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా ఉండదు. కంటెంట్ ఈజ్ కింగ్ అన్నట్టుగా బాక్సాఫీస్ వద్ద తమ తీర్పును స్పష్టంగా చెబుతారు.
అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినీ మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త కథలు, కొత్త పద్ధతులను వెతుకుతూనే ఉంటారు. థియేటర్లలో సక్సెస్ కి ఫార్ములా ఉందా.. ? ప్రేక్షకులను మరింతగా కథలోకి ఎలా తీసుకెళ్లాలి? అనే అంశాలపై ప్రయోగాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవి విజయవంతమవుతాయి.. మరికొన్ని సందర్భాల్లో ఆశించిన ఫలితాలు ఇవ్వవు. కానీ ఇటీవల టాలీవుడ్‌లో ఒక కథన శైలి మాత్రం వరుసగా ప్రేక్షకుల మన్ననలు పొందుతూ, బాక్సాఫీస్ వద్ద విజయాలకు బలమైన ఆయుధంగా మారుతోంది.
సినిమా కథను నేరుగా చెప్పకుండా.. అందులోని ఓ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఈ నరేటివ్ స్టైల్ ప్రత్యేకత. ఆ పాత్ర కళ్లలోంచి హీరో ప్రపంచాన్ని, అతడి ప్రయాణాన్ని, అతడి గొప్పతనాన్ని ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు. ఈ కథన విధానాన్ని తెలుగు దర్శకులు కొత్త స్థాయికి తీసుకెళ్లి ఎన్నో బ్లాక్‌బస్టర్లకూ పునాది వేశారు.
వాస్తవానికి ఈ టెక్నిక్ కొత్తది కాదు. చాలా కాలంగా సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా దీనిని మరింత ప్రభావవంతంగా వినియోగిస్తూ దర్శకులు ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నారు. ఈ విధానంలో కథ చెప్పడం వల్ల హీరో ఎవరన్నదానికంటే.. అసలు ఏం జరిగింది?, ఈ వ్యక్తి ఎందుకు అంత గొప్పవాడు?, అతడి వెనుక కథ ఏమిటి? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుంది.
కథను డైరెక్ట్‌గా చెప్పడం కంటే.. ఒక క్యారెక్టర్ మెమొరీస్, ఎక్స్‌పీరియెన్సెస్, పర్స్పెక్టివ్ ద్వారా ఆవిష్కరించడం వల్ల స్టోరీకి మరింత ఎమోషన్, మిస్టరీ, ఎలివేషన్ యాడ్ అవుతాయి. ఆ క్యారెక్టర్‌తో పాటు ప్రేక్షకుడు కూడా హీరో జర్నీలో భాగమైపోతాడు. అందుకే ఈ తరహా నరేటివ్ స్టైల్ సినిమాలు ఆడియన్స్‌ను బలంగా కనెక్ట్ చేయడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా ఘన విజయాలు సాధించాయి.
మరి ఈ నరేటివ్ స్టైల్‌తో కథ చెప్పి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆ బ్లాక్‌బస్టర్ మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం…
బాహుబలి..
భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో బాహుబలి ఒకటి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ కేవలం యాక్షన్, గ్రాఫిక్స్, ఎమోషన్స్‌తోనే కాదు.. కథను చెప్పిన విధానంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా కట్టప్ప పాత్ర ద్వారా నడిచిన నరేషన్ బాహుబలి విజయానికి ప్రధాన బలంగా నిలిచింది.
మొదటి భాగంలో శివుడు (మహేంద్ర బాహుబలి) తన మూలాలను వెతుక్కుంటూ మహిష్మతి రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత కథ ఒక్కసారిగా ఆసక్తికర మలుపు తిరుగుతుంది. బాహుబలి ఎవరు?, మహిష్మతి చరిత్ర ఏంటి.. అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న సమయంలో కట్టప్ప రంగంలోకి దిగుతాడు.
అయితే బాహుబలి సిరీస్‌లో అత్యంత సంచలనంగా మారిన అంశం “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న. మొదటి భాగం చివర్లో కట్టప్ప చేతుల్లో అమరేంద్ర బాహుబలి హత్యకు గురవడం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ఆ ఒక్క ప్రశ్నతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో, సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

రెండో భాగంలో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే బాధ్యతను కూడా రాజమౌళి కట్టప్పకే అప్పగించాడు. ప్రేక్షకులు కేవలం కథను వినలేదు.. కట్టప్ప కళ్లలోంచి బాహుబలిని చూశారు. అదే ఈ నరేషన్ స్టైలె స్టోరీ టెల్లింగ్ ప్రత్యేకత. అందుకే సినిమా ముగిసే సరికి కట్టప్ప పాత్ర కేవలం ఒక సహాయక పాత్రగా కాకుండా, బాహుబలి కథను ప్రేక్షకులకు చేరవేసిన క్యారెక్టర్ గా నిలిచిపోయింది.
కేజీఎఫ్..
మాస్ సినిమాల నిర్వచనాన్నే మార్చేసిన చిత్రాల్లో కేజీఎఫ్ ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం రాఖీ భాయ్ అనే పాత్ర చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు.. ఒక సామాన్యుడు ఎలా ఒక సామ్రాజ్యాన్ని శాసించే లెజెండ్‌గా మారాడనే గాథ. ఈ కథను ప్రేక్షకులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించింది నరేషన్ స్టైల్.

సినిమా ప్రారంభం నుంచే దర్శకుడు రాఖీ భాయ్‌ను సాధారణ హీరోగా చూపించలేదు. మొదటి భాగంలో ఆనంద్ ఇంగలగి చెప్పిన కథ, రెండో భాగంలో అతని కుమారుడి పాత్రలో కనిపించిన ప్రకాశ్ రాజ్ ద్వారా కొనసాగుతుంది. ముంబై వీధుల్లో పేదరికంతో పెరిగిన ఓ బాలుడు.. తల్లి కలను నెరవేర్చేందుకు అధికారాన్ని, సంపదను లక్ష్యంగా పెట్టుకుని సాగిన ప్రయాణం.. చివరికి కేజీఎఫ్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకున్న విధానం.. ఈ మొత్తం ప్రయాణాన్ని దర్శకుడు నేరుగా చూపించకుండా నరేషన్ స్టైల్ లో చెప్పించడం సినిమాకు అతిపెద్ద బలంగా మారింది.
సలార్..
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్… ప్రేక్షకులకు వేరే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిన గాథ. దేవా కథను నేరుగా ప్రారంభించకుండా, ముందుగా ఖాన్సార్ అనే సామ్రాజ్యాన్ని ప్రేక్షకుల పరిచయం చేస్తాడు. అసలు ఖాన్సార్ అంటే ఏమిటి? అక్కడ ఎవరు పాలిస్తున్నారు? ఆ రాజ్యంలో జరుగుతున్న కుట్రలు, ద్రోహాలు, అధికార పోరాటాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే కథ ముందుకు సాగుతుంది.
సినిమా ప్రారంభంలో హీరోయిన్ ఆధ్య (శృతి హాసన్) విదేశాల నుంచి భారతదేశానికి చేరుకుంటుంది. ఆమె చుట్టూ నెలకొన్న ప్రమాదాలు, ఆమెను వెంబడించే శత్రువులు, ఆమెకు రక్షణగా నిలిచే దేవా.. ఇలా కథ మొదలవుతుంది. అయితే ప్రేక్షకులకు దేవా గురించి కూడా పూర్తి సమాచారం ఉండదు. ఈ క్రమంలోనే ఆధ్యకు సినిమాలోని వివిధ పాత్రలు ఖాన్సార్ గురించి, దేవా గురించి చెప్పడం ప్రారంభిస్తాయి.

ఖాన్సార్ చరిత్రను వివరిస్తూ ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. రాజమన్నార్ సామ్రాజ్యం, తెగల ఆధిపత్యం, అధికారం కోసం జరిగే రక్తపాత పోరాటాలు, వారసత్వ రాజకీయాలు.. ఇలా ఖాన్సార్ వెనుక ఉన్న భారీ ప్రపంచం క్రమంగా రివీల్ అవుతుంది. దీంతో ప్రేక్షకులు కేవలం కథను చూడరు.. ఆ సామ్రాజ్యంలో భాగమైపోతారు.
అదే సమయంలో దేవా–వరధరాజ్ మన్నార్ స్నేహం కథలో ప్రధాన ఆకర్షణగా మారుతుంది. చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎలా విడిపోయారు? పరిస్థితులు వారిని ఎందుకు శత్రువులుగా మార్చాయి? అనే అంశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ నరేటివ్ స్టైల్‌లో ఆసక్తికరంగా ఆవిష్కరించాడు.
ఖాన్సార్ రాజకీయాలు, అధికారం కోసం జరిగే కుట్రలు, స్నేహం వెనుక దాగి ఉన్న భావోద్వేగాలను ఒక్కో పొరగా విప్పుతూ కథను ముందుకు నడిపించాడు. ముఖ్యంగా దేవా, వర్ధరాజ్ మధ్య అసలు విభేదాలకు కారణమేంటనే ప్రశ్నను చివరి వరకు సస్పెన్స్‌గా కొనసాగిస్తూ, రెండో భాగంపై భారీ అంచనాలు పెంచే క్లిఫ్‌హ్యాంగర్‌తో ముగించాడు.
దేవర
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర… ఒక తీర ప్రాంతం, అక్కడి ప్రజల జీవన విధానం, వారి భయాలు, వారి హీరోగా ఎదిగిన దేవర గాథను నరేటివ్ స్టైల్‌లో చెప్పిన సినిమా. కథను నేరుగా దేవర చుట్టూ ప్రారంభించకుండా, అతడి గురించి వినిపించే కథలతో ప్రేక్షకులను ఎర్ర సముద్రం ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఈ చిత్ర ప్రత్యేకత.

సినిమా ప్రారంభంలోనే ఎర్ర సముద్రం ప్రాంతంలో జరిగిన ఘటనలపై విచారణ జరిపేందుకు ఓ ప్రత్యేక అధికారి అక్కడికి వస్తాడు. ఆ ప్రాంతం గురించి, అక్కడి ప్రజల గురించి, ముఖ్యంగా దేవర అనే వ్యక్తి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ పోషించిన పాత్ర రంగంలోకి దిగుతుంది. ఆ అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రకాష్ రాజ్ పాత్ర దేవర కథను వివరించడం ప్రారంభిస్తుంది. అలా ప్రేక్షకులు కూడా ఆ ప్రత్యేక అధికారి మాదిరిగానే దేవర గురించి తెలుసుకుంటూ సినిమాలోని ఎర్రసముద్రంలోకి ఎంటర్ అయిపోతారు.
పెద్ది
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన పెద్ది కూడా ఇదే నరేటివ్ స్టైల్‌ను అనుసరించినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. కథను నేరుగా పెద్ది పాత్రతో ప్రారంభించకుండా, ఒక స్పోర్ట్స్ కౌన్సిల్ అధికారితో మొదలుపెడతారు. దేశానికి కొత్త క్రీడాకారులను అందించాలి, గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో అతడు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు.

ఈ క్రమంలో అతడికి పెద్ది గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. అక్కడి నుంచి పెద్ది కథ మొదలవుతుంది. ఒక సాధారణ యువకుడు తన గ్రామం కోసం ఎంతగా పోరాడాడు? క్రీడల ద్వారానే తమ ఊరికి గుర్తింపు తీసుకురావాలనే సంకల్పంతో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అనే విషయాలు క్రమంగా బయటపడతాయి. గ్రామ ప్రజల ఆశలు, వారి ఆత్మగౌరవం, పెద్ది పట్టుదల, అతడి పోరాటం అన్నీ… ఆ వ్యక్తి చెప్పే కథ ద్వారా ప్రేక్షకులకు చేరతాయి. నరేటివ్ స్టైల్ వల్ల పెద్ది జర్నీ మరింత భావోద్వేగంగా, ప్రభావవంతంగా మారిందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మహానటి..
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి సావిత్రి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం అంత సులభం కాదు. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి చిత్రంలో ఆ సవాలును వినూత్నమైన నరేటివ్ స్టైల్‌తో అధిగమించాడు. సావిత్రి జీవిత కథను నేరుగా చెప్పకుండా, ఓ జర్నలిస్ట్ అన్వేషణగా ప్రేక్షకుల ముందుంచాడు.
సినిమాలో జర్నలిస్ట్ మధురవాణి (సమంత), ఫొటోగ్రాఫర్ విజయ్ ఆంటోనీ (విజయ్ దేవరకొండ)తో కలిసి సావిత్రి జీవితంలోని తెలియని కోణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు దక్షిణ భారత సినీ ప్రపంచాన్ని ఏలిన మహానటి ఎందుకు ఒంటరైంది? ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఆమె ప్రయాణం సాగుతుంది.

ఈ క్రమంలో ఒక్కో వ్యక్తిని కలుస్తూ, ఒక్కో సంఘటనను తెలుసుకుంటూ మధురవాణి ముందుకు సాగుతుంది. అదే సమయంలో ప్రేక్షకులు కూడా ఆమెతో కలిసి సావిత్రి జీవితాన్ని అనుభవిస్తారు. చిన్ననాటి నుంచి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ప్రయాణం, జెమినీ గణేశన్‌తో ప్రేమ, వివాహం, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు, చివరి దశలో ఎదుర్కొన్న విషాద పరిస్థితులు.. అన్నీ ఒక పరిశోధనాత్మక కథనంలా ఆవిష్కృతమవుతాయి.
ఈ నరేషన్ వల్ల సావిత్రి కథ కేవలం బయోపిక్‌గా కాకుండా, ఒక గొప్ప కళాకారిణి జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయాణంగా మారింది. ప్రేక్షకులు ఆమె విజయాలను మాత్రమే కాదు.. ఆమె బాధలను కూడా దగ్గరగా అనుభూతి చెందారు. అందుకే మహానటి కేవలం ఓ హిట్ సినిమా కాకుండా, తెలుగు సినీ చరిత్రలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది.
జెర్సీ..
జెర్సీ సినిమా ఓ తండ్రి తన కొడుకు కోసం చేసిన త్యాగం గురించి చెబుతుంది. కొడుకు కోరికను నెరవేర్చాలనే తపనతో, తన ప్రాణాలకే ముప్పు ఉందని తెలిసినా వెనక్కి తగ్గని ఓ తండ్రి గాథ ఇది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ కథను నరేటివ్ స్టైల్‌లో చెప్పడం వల్ల సినిమా మరింత భావోద్వేగభరితంగా మారింది.
సినిమాలో అర్జున్ (నాని) జీవితం సాధారణ క్రికెటర్ కథ కాదు. అపారమైన టాలెంట్ ఉన్నప్పటికీ, వ్యక్తిగత పరిస్థితులు, ఆరోగ్య సమస్యల కారణంగా వెనుకబడిపోయిన ఓ వ్యక్తి కథ. అయితే ఈ కథను ప్రేక్షకులకు పరిచయం చేసేది అర్జున్ కుమారుడే. తన తండ్రి జీవితంపై రాసిన పుస్తకం మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన తర్వాత, ఆ పుస్తకం కొనుగోలు చేయడానికి వచ్చిన వారికి అర్జున్ అసలు కథను వివరిస్తూ సినిమా ముందుకు సాగుతుంది. ఒక కొడుకు జ్ఞాపకాల రూపంలో తండ్రి జీవితాన్ని ప్రేక్షకులు చూస్తారు.

అర్జున్ ఎందుకు మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాడు? తన వయసులో మళ్లీ మైదానంలోకి ఎందుకు దిగాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ కథ సాగుతుంది. ప్రతి దశలోనూ తన కొడుకు ముఖంలో ఆనందం చూడాలనే తపన అర్జున్‌ను ముందుకు నడిపిస్తుంది. అయితే ఈ కథలోని అత్యంత భావోద్వేగ క్షణం క్లైమాక్స్‌లో వస్తుంది.
సినిమా మొత్తం తన తండ్రి గురించి కథ చెబుతున్న కొడుకుకే.. అర్జున్ ప్రాణాంతక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే విషయం తెలియదు. ప్రేక్షకులకు కూడా అదే సస్పెన్స్‌గా కొనసాగుతుంది. చివర్లో ఆ నిజం బయటపడినప్పుడు కథ ఒక్కసారిగా హృదయాలను తాకే స్థాయికి చేరుతుంది.
సక్సెస్‌కు సీక్రెట్ ఫార్ములా?
సినిమా ప్రారంభమైన క్షణం నుంచే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించడం, పాత్రలతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పరచడం, కథలోని మిస్టరీని చివరి వరకు కొనసాగించడం.. ఇవే నరేటివ్ స్టైల్ ప్రధాన బలాలుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రేక్షకుడు కథను కేవలం చూడడమే కాకుండా.. ఆ కథను చెబుతున్న పాత్రతో కలిసి ప్రయాణిస్తున్న అనుభూతిని పొందుతాడని వారు చెబుతున్నారు.
అందుకే బాహుబలి, కేజీఎఫ్, సలార్, దేవర, పెద్ది వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల నుంచి మహానటి, జెర్సీ వంటి భావోద్వేగ ప్రధాన చిత్రాల వరకు ఈ కథన శైలి బలంగా పనిచేసిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కథలోని హీరో కంటే ముందు అతడి గురించి వినిపించే కథలు, అతడి చుట్టూ అల్లుకున్న మిస్టరీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతాయని అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా అసలు ఏం జరిగింది?, ఈ వ్యక్తి ఎందుకు అంత గొప్పవాడు?, అతడి వెనుక కథ ఏమిటి? వంటి ప్రశ్నలను ప్రేక్షకుల మనసుల్లో నాటగలిగితే కథపై ఆసక్తి మరింత పెరుగుతుందని విమర్శకులు చెబుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో పలువురు దర్శకులు హీరో పాత్రతో పాటు కథను చెప్పే పాత్రకూ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది.
హీరో ఎంట్రీ కంటే ముందు అతడి గురించి వినిపించే కథే ప్రేక్షకులను కథలోకి మరింతగా లాగుతుందనేది అభిమానుల అభిప్రాయం. అందుకే ఈ నరేటివ్ స్టైల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తున్న విజయవంతమైన కథన విధానాల్లో ఒకటిగా మారిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
