Child Abuse Case I పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

Child Abuse Case I పోక్సో కేసు.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

  • బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం
  • నిందితుడికి రూ.20 వేల జరిమానా

నవాబుపేట్, ఆంధ్రప్రభ:
మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది.

నవాబుపేట్ ఎస్‌ఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్ మండలం మోతీఘన్‌పూర్ గ్రామానికి చెందిన పస్పుల నందు (29)పై నమోదైన పోక్సో కేసు విచారణ పూర్తికాగా, మహబూబ్‌నగర్‌లోని ప్రత్యేక పోక్సో, అత్యాచార కేసుల విచారణ న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించింది.

ఈ కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తమన్ రాజరాజేశ్వరి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

ఈ కేసులో పటిష్టమైన సాక్ష్యాధారాలు సేకరించి, న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదనలు వినిపించి నేరాన్ని నిరూపించడంలో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. జాన్, రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గాంధీ నాయక్, నవాబుపేట్ మాజీ ఎస్‌ఐ విక్రమ్, కోర్టు లైజన్ అధికారులు బాలకృష్ణ, ఏఎస్ఐ కృష్ణయ్య, పోలీస్ సిబ్బంది శంకర్, రహీం, సీడీఓ విజయ్‌కుమార్‌లను జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో జిల్లా పోలీస్ శాఖ అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోందన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును శాస్త్రీయ దర్యాప్తుతో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పోక్సో చట్టం కింద నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply