Kavitha comments I చెల్లె కవిత… జాగ్రత్తగా మాట్లాడు: ఎంపీ రఘునందన్ రావు

Kavitha comments I చెల్లె కవిత… జాగ్రత్తగా మాట్లాడు: ఎంపీ రఘునందన్ రావు

– కవిత వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనమని విమర్శ
– సింగూరు, దుబ్బాక అభివృద్ధిని పదేళ్లలో ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్న
– రాయపోలు పోలీస్ స్టేషన్‌కు ఇప్పటికీ సొంత భవనం లేదని ఆగ్రహం

– బుల్లెట్ ట్రైన్ వ్యాఖ్యలు రాజకీయాల కంటే కామెడీలా ఉన్నాయని ఎద్దేవా

సంగారెడ్డి, జూన్ 8 (ఆంధ్రప్రభ):
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల సంగారెడ్డిలో చేసిన వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కవితపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పలు రాజకీయ అంశాలపై స్పందించారు.

కవిత తనపై విమర్శలు చేసే ముందు కనీస రాజకీయ అవగాహన కలిగి ఉండాలని రఘునందన్ రావు అన్నారు. తాను జహీరాబాద్ ఎంపీనా, మెదక్ ఎంపీనా అన్న విషయంపై కూడా స్పష్టత లేకుండా మాట్లాడటం ఆమె రాజకీయ పరిజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. స్క్రిప్ట్ రాసిచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

జహీరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తానని తాను ఎప్పుడూ హామీ ఇవ్వలేదని స్పష్టం చేసిన ఆయన, అలాంటి వ్యాఖ్యలు రాజకీయ చర్చల కంటే కామెడీ కార్యక్రమాలను తలపిస్తున్నాయని అన్నారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజా సమస్యలు కనిపించలేదా అని ప్రశ్నించిన రఘునందన్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగూరు అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. సింగూరు అభివృద్ధిని కేసీఆర్, హరీశ్ రావు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడే ముందు గత పదేళ్లలో చేపట్టిన పనుల వివరాలు వెల్లడించాలని కవితను డిమాండ్ చేశారు. దుబ్బాకలో కనీసం ఒక డివైడర్ రోడ్డు కూడా నిర్మించలేదని, రాయపోలు పోలీస్ స్టేషన్ ఇప్పటికీ అద్దె భవనంలోనే కొనసాగుతోందని తెలిపారు. సొంత భవనం కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని విమర్శించారు.

మార్కుక్ ప్రాంతంలోని ఫామ్‌హౌస్ అవసరాల కోసం మాత్రం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారని, ప్రజా అవసరాలను మాత్రం విస్మరించారని ఆరోపించారు. తాను హరీశ్ రావుతో రాజకీయంగా పోరాడి దుబ్బాక ఎమ్మెల్యేగా, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసి మెదక్ ఎంపీగా గెలిచానని గుర్తు చేశారు.

వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ బీజేపీ కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదంతోనే విజయం సాధించానని పేర్కొన్నారు. “లాలూచీకి చిరునామా కల్వకుంట్ల కుటుంబమే” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జాగృతి సంస్థ ప్రారంభించినప్పటి కవితకు, ప్రస్తుత కవితకు చాలా తేడా ఉందని వ్యాఖ్యానించిన రఘునందన్ రావు, తెల్లాపూర్‌ను తెలంగాణపూర్‌గా మారుస్తానన్న హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

రఘునందన్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply