ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

  • నాణ్యమైన విత్తనాలే విక్రయించాలి
  • అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: తహసీల్దార్ నరేష్

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రెవెన్యూ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు దుకాణాల్లోని విత్తనాల స్టాక్ రిజిస్టర్లు, రసీదులు, ఇన్‌వాయిస్‌లు, లైసెన్సులు, ఇతర రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం. నరేష్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని సూచించారు. కల్తీ లేదా అనుమతిలేని విత్తనాలను విక్రయించి రైతులను మోసం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతుకు కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని దుకాణ యజమానులకు స్పష్టం చేశారు.

రైతులు ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని సూచించారు. అనుమతిలేని విత్తనాల విక్రయాలపై సమాచారం అందితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు.

ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శరత్, మండల వ్యవసాయ అధికారి టి. రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply