ఎరువుల పంపిణీలో పారదర్శకతకు పెద్దపీట.
ఎరువుల పంపిణీలో పారదర్శకతకు పెద్దపీట.
ఆధార్ ఆధారిత బుకింగ్‌తో రైతులకు సులభంగా ఎరువుల అందుబాటు.
నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఎరువుల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల పంపిణీ జిల్లాలో సజావుగా సాగుతోందని జిల్లా వ్యవసాయ అధికారి పి.ఎల్. వరలక్ష్మి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ ఆధారిత బుకింగ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సోమవారం కర్నూలు మండలంలోని మానా గ్రోమోర్ సెంటర్, శివ రామకృష్ణ ఫెర్టిలైజర్స్‌తో పాటు కల్లూరు మండలంలోని లక్ష్మీపురం రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి సందర్శించారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, విక్రయాల నమోదు, రైతుల బుకింగ్ ప్రక్రియ, ఏపీఏఐఎంఎస్ (APAIMS) యాప్ అమలును క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆధార్ ఆధారిత ఎరువుల బుకింగ్ విధానం ద్వారా ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం నెలకొల్పినట్లు తెలిపారు. రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలు (ప్యాక్స్), లైసెన్స్ పొందిన ఎరువుల విక్రయదారులు రైతుల భూ వివరాలను ధృవీకరించి ఏపీఏఐఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారని వివరించారు.
రైతులు తమ ఆధార్ నంబర్‌తో ధృవీకరణ పూర్తి చేసుకుని అవసరమైన ఎరువులను ముందుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. అంతేకాకుండా తమకు అనుకూలమైన ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎంపిక చేసుకుని అక్కడి నుంచే ఎరువులు పొందే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
ఓటీపీతోనే విక్రయాలు
జిల్లాలోని అన్ని రిటైల్ ఎరువుల డీలర్లు, రైతు సేవా కేంద్రాలు తప్పనిసరిగా ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారానే ఎరువుల విక్రయాలు నిర్వహించాలని ఆదేశించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. రైతుల ఆధార్ ధృవీకరణ అనంతరం ఓటీపీ ఆధారంగా మాత్రమే ఎరువుల విక్రయాలు జరపాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాన్యువల్ విక్రయాలు చేపట్టరాదని స్పష్టం చేశారు.
ఎరువుల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రిటైల్ డీలర్లు, ప్యాక్స్ సిబ్బంది, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
స్టాక్ రిజిస్టర్ల పరిశీలన
తనిఖీల సందర్భంగా ఎరువుల నిల్వల రిజిస్టర్లు, విక్రయాల నమోదు పత్రాలు, ఏపీఏఐఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేసిన వివరాలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
.సమృద్ధిగా నిల్వలు.
జిల్లాలో యూరియా, డీఏపీతో పాటు ఇతర రసాయన ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వరలక్ష్మి తెలిపారు. ఎరువుల కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఖరీఫ్ అవసరాలకు అనుగుణంగా తగిన నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
రైతులు అధికారిక విక్రయ కేంద్రాల ద్వారా మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలని, ఆధార్ ధృవీకరణతో బుకింగ్ చేసుకుని ప్రభుత్వ విధానాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఈ తనిఖీలలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ప్యాక్స్ ప్రతినిధులు, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
రైతులకు సూచనలు
ఆధార్ నంబర్‌తో ముందస్తుగా ఎరువులు బుక్ చేసుకోవాలి. ఏపీఏఐఎంఎస్ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి.ఓటీపీ ధృవీకరణ తర్వాతే ఎరువులు పొందాలి. అధికారిక విక్రయ కేంద్రాల నుంచే ఎరువులు కొనుగోలు చేయాలి.
ఎరువుల కొరతపై అపోహలు నమ్మవద్దని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
