ప్రభుత్వ పెట్రోల్ బంక్‌లో రూ.74 లక్షల గోల్‌మాల్?..
ప్రభుత్వ పెట్రోల్ బంక్‌లో రూ.74 లక్షల గోల్‌మాల్?..
సబ్‌జైలు వార్డెన్‌పై చీటింగ్ కేసు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌పీసీఎల్ (HPCL) పెట్రోల్ బంక్‌లో సుమారు రూ.74 లక్షల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు వెలుగులోకి రావడం జిల్లాలో సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో సబ్‌జైలు హెడ్ వార్డెన్‌గా పనిచేసిన రామచంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బనగానపల్లె సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, బనగానపల్లె పట్టణంలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంక్ ఆర్థిక లావాదేవీలు 2022 నుంచి 2025 ఏప్రిల్ వరకు అప్పటి హెడ్ వార్డెన్ రామచంద్రారెడ్డి పర్యవేక్షణలో సాగాయి.
పెట్రోల్ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంలో కొంత భాగాన్ని ప్రతిరోజూ ఫోన్‌పే చెల్లింపుల రూపంలో పెట్రోల్ బంక్ సిబ్బంది ద్వారా తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించి, సుమారు రూ.74 లక్షలు దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయమై జిల్లా జైళ్ల శాఖ సూపరింటెండెంట్ యోగేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖైదీల సహకారంతో నిర్వహిస్తున్న సబ్‌జైలు పెట్రోల్ బంక్ లావాదేవీల్లో భారీ వ్యత్యాసాలు గుర్తించడంతో అధికారులు అంతర్గతంగా పరిశీలన చేపట్టినట్లు సమాచారం.
పరిశీలనలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన అనంతరం హెడ్ వార్డెన్ రామచంద్రారెడ్డిపై ఫిర్యాదు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఫిర్యాదు మేరకు బనగానపల్లె పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద చీటింగ్, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
ఇటీవల జరిగిన బదిలీల్లో బనగానపల్లెలో పనిచేసిన రామచంద్రారెడ్డి ఆళ్లగడ్డ సబ్‌జైలుకు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసుపై సమగ్ర విచారణ కొనసాగుతోందని సీఐ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
