కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకున్న రైతు.. ఉద్రిక్తత
చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు చెందిన వ్యవసాయ భూమిని సొంత అన్నదమ్ములు అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ వి కోట మండలానికి చెందిన రైతు రాఘవేంద్ర, ఆయన భార్యతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరైన వృద్ధ దంపతులు తమ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న భూమిని కొంతకాలంగా తమ అన్నదమ్ములు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని, భూమిని తిరిగి ఇప్పించాలని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులను పలుమార్లు ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రాఘవేంద్ర దంపతులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై వెంటనే వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అనంతరం రైతు రాఘవేంద్ర మాట్లాడుతూ, “మా భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారు. న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. అధికారులు వినతిపత్రాలు తీసుకుంటున్నారు కానీ సమస్యను పరిష్కరించడం లేదు. ఇక మాకు చావే శరణ్యంగా కనిపించింది” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటనతో కలెక్టరేట్ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడికి చేరుకున్న అధికారులు బాధిత దంపతులతో మాట్లాడి వారి సమస్యపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. భూమి వివాదానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు కూడా స్పందించి, సంబంధిత తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బందిని వివరణ కోరినట్లు తెలిసింది. భూ వివాదంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కలెక్టరేట్ వంటి ప్రజా ఫిర్యాదుల వేదిక వద్ద వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమైతే ఇలాంటి తీవ్ర సంఘటనలు చోటుచేసుకునే పరిస్థితి ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రైతు రాఘవేంద్ర దంపతులు సురక్షితంగా ఉన్నారని, వారి ఫిర్యాదుపై అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
