Krishna River Water | లక్ష ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Krishna River Water | లక్ష ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Krishna River Water | మూడు విడతల్లో ప్రాజెక్టు పనులు
2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశం

Krishna River Water | వికారాబాద్ జిల్లా, ఆంధ్రప్రభ ప్రతినిధి: అందరి దృష్టి కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల పథకంపై పడింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రాజెక్టును చేపట్టారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు, తాగునీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని అమలు చేస్తున్నారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేస్తూ జీవో 69 జారీ అయింది.

ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఆయా ప్రాంతాలకు సాగునీటిని అందించాలని రూపకల్పన చేశారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం జీవో 14ను జారీ చేసి, కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని తిరిగి చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు సాగునీరు, 123 గ్రామాలకు తాగునీటిని అందించాలన్నది లక్ష్యం.

ఇందుకోసం బీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన భూత్పూర్ రిజర్వాయర్ నుంచి 7 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కొడంగల్-నారాయణపేట్ ప్రాజెక్టును నిర్మించే విధంగా డిజైన్ చేశారు. మూడు విడతల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టులో మొదటి విడత కింద అప్రోచ్ చానళ్లు, పంప్ హౌస్‌ల నిర్మాణం చేపడతారు. రెండో విడత కింద కెనాల్ పనులు, చెరువుల సామర్థ్యం పెంచడం, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేస్తారు. మూడో విడతలో విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మిస్తారు.

ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.4,885 కోట్లుగా అంచనా వేశారు. మొదటి విడత పనులకు రూ.2,945 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1,400 కోట్లు మంజూరు చేయడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. మొదటి విడత పనులను మేఘా, రాఘవ సంస్థలు దక్కించుకుని చేపడుతున్నాయి. ప్రస్తుతం కాట్రావులపల్లి వద్ద అప్రోచ్ చానళ్లు, ఉట్కూరు, పేరపల్లి వద్ద పంప్ హౌస్ పనులను ప్రారంభించారు.

భూసేకరణ మొత్తం పూర్తి కావడంతో ప్రాజెక్టు పనులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదనే చెప్పాలి. పరిహారం కింద ఎకరానికి రూ.20 లక్షలు చెల్లించారు. మేఘా సంస్థ అప్రోచ్ చానల్ పనులను అత్యంత వేగంగా నిర్మిస్తోంది.

కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల పథకం కింద మక్తల్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలు, నారాయణపేట్ నియోజకవర్గంలో 16 వేల ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గంలో 53 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. ప్రాజెక్టులో భాగంగా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి బొంరాస్‌పేట్ వరకు మొత్తం పది రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు.

మక్తల్‌లో ఉట్కూరు, నారాయణపేట్‌లో జాజాపూర్, దామరగిద్ద, పేరపల్లి, జాయమ్మ, కాన్‌కుర్తి, కొడంగల్ పరిధిలోని దౌల్తాబాద్, హస్నాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట్, ఈర్లపల్లి, లక్ష్మీపూర్‌లలో రిజర్వాయర్లను నిర్మిస్తారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువుల సామర్థ్యాన్ని పెంచి రిజర్వాయర్లుగా మార్చేందుకు ప్రాజెక్టును డిజైన్ చేశారు.

మూడు లిఫ్ట్‌ల ద్వారా కృష్ణా నది నీటిని ఎత్తిపోస్తారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తుది అనుమతులు రావాల్సి ఉంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల పథకం పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.

అంతకుముందు గత నెలలో కొడంగల్ పర్యటించిన సమయంలో కూడా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కొడంగల్ ప్రాంతంలోని భూములకు కృష్ణా నది నీటిని పారిస్తానని హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం క్షేత్ర పర్యటన సమయంలో కూడా 2027 డిసెంబర్ నాటికి కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు.

Leave a Reply