ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో జాప్యం..
ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లో జాప్యం..
బ్యాంకుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
తొర్రూరు,ఆంధ్రప్రభ: వాహన ఇన్సూరెన్స్ వ్యవహారంలో ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేటు బ్యాంకు పై చర్యలు తీసుకోవాలని బాధితుడు గుండ్ల ఉపేందర్ కోరారు.ఈ మేరకు ఆదివారం డివిజన్ కేంద్రంలో వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా చైర్మన్ వింజమూరి సుధాకర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు…. దంతాలపల్లి మండలం నిదానపురం గ్రామానికి చెందిన గుండ్ల పద్మ కోదాడలోని ఇండస్ ఇండ్ బ్యాంకులో రూ.12 లక్షల లోన్ తీసుకుని మారుతి సుజుకి ఎర్టిగా కారు కొనుగోలు చేసింది. బ్యాంకులో లోను తీసుకునేందుకు అదే గ్రామానికి చెందిన సమీప బంధువు ఉపేందర్ షూరిటీగా ఉన్నాడు.
బ్యాంకు సూచన మేరకు చోళ మండల ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కారుకు ఇన్సూరెన్స్ చేయించారు. ఈ ఏడాది జనవరి 30న కారు కొనుగోలు దారు పద్మ అనారోగ్యంతో మరణించింది. మరణానంతరం ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కిస్తీలు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ సదరు ఇన్సూరెన్స్ కంపెనీ కిస్తీలు చెల్లించకుండా మోసగించింది.
కాగా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి కారు కాగితాలు బ్యాంకు ప్రతినిధులు ఇప్పించాల్సి ఉండగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.దీంతో కారు లోనుకు షూరిటీగా ఉన్న ఉపేందర్ బాధితురాలి పక్షాన వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్యాంకు ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వాహన కాగితాలు ఇప్పించాలని ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా డిసిఐసి జిల్లా చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ.. వినియోగదారులను మోసగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వారికి వాహన పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
