750-School-Bus : బడి బస్సు రెడీ Andhra Prabha Top Story

750-School-Bus : బడి బస్సు రెడీ Andhra Prabha Top Story

  • షిట్​ నెస్​ లెస్సే
  • ఈనెల 12న స్కూళ్లు రీఓపెన్..
  • ఆర్టీఏ తనిఖీలు ముమ్మరం
  • బ‌య‌ట ప‌డుతున్న లోపాలు ..
  • నిబంధ‌న‌లు పాటిస్తున్నారా…
  • కాగితాగాల‌కే ప‌రిమిత‌మా?
  • అధికారులు అప్రమత్తం

( ప‌ల్నాడుబ్యూరో , ఆంధ్ర‌ప్ర‌భ‌)

లక్షలు పోసి పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులకు.. ఉదయం బస్సు ఎెక్కిన తమ బిడ్డ సాయంత్రం క్షేమంగా ఇల్లు చేరేవరకు గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే ఉంటాయి. వేసవి సెలవులు ముగిసి, ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల బస్సుల భద్రతపై ‘ఆంధ్రప్రభ’ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్.

750-School-Bus : అధికారుల సంసిద్దం…!

ప‌ల్నాడు జిల్లాలోని నాలుగు స‌హాయ ర‌వాణా కార్యాలయాల పరిధిలో 162 ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి 750 బస్సులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పాఠశాలలు ఈనెల 12న తెరచుకోనున్నాయి. అనేక మంది విద్యార్థులు బడి బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వాహనాల్లో ఉండాల్సిన సౌకర్యాలు, పాటించాల్సిన నిబంధనలపై రవాణాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వీటికి ఆర్టీఏ కార్యాలయాల్లో సామర్థ్య(ఫిట్‌నెస్‌) పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏటా మే 15నాటికి బడి బస్సుల సామర్థ్య ధ్రువపత్రం గడువు ముగుస్తుంది. విద్యాలయాలు పునఃప్రారంభమయ్యే నాటికి యాజమాన్యాలు తమ బడిబస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఈనేపథ్యంలో రవాణాశాఖ అధికారులు ఆర్టీఏ కార్యాలయాల్లో రోజూ బడిబస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. బస్సుకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు, విద్యార్థులకు వసతులు సక్రమంగా ఉన్నాయా.. భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా..? అని పరిశీలిస్తున్నారు. ఎంవీఐలు బస్సులను నడిపి ఫిట్‌నెస్‌ను తనిఖీ చేస్తున్నారు. బస్సులకు ఏవైనా మరమ్మతులు ఉంటే చేయించుకొని రావాలని సూచించి వెనక్కి పంపించేస్తున్నారు. ఆ తరువాతే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేస్తున్నారు. ఈఏడాది మూడంచెల విధానాన్ని అనుసరిస్తున్నారు. బస్సు ఇన్‌ఛార్జి, ప్రిన్సిపల్, ఎంవీఐ సంతకాలు బడిబస్సు ఫైల్‌పై ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

750-School-Bus : ఈ నిబంధ‌న‌లు తప్పనిసరి….!

బడి బస్సులో అత్యవసర గ్లాస్‌ ద్వారం, మంటలార్పే పరికరాలు, ప్రథమ చికిత్స కిట్, పుస్తకాలు పెట్టుకునేందుకు హ్యాంగర్లు ఉండాలి. కిటికీల వద్ద ఇనుప గ్రిల్స్, ఫైర్‌ అలారం, మంటలార్పే వాటర్‌ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాలి. పిల్లలు పట్టుకునేలా నిలువు స్తంభాలు, ఇండికేటర్‌ లైట్లు, అద్దాలు, తలుపుల వద్ద లాకింగ్‌ సిస్టం ఉండాలి. పిల్లలు ఎక్కేందుకు వీలుగా పటిష్ఠమైన ఫుట్‌బోర్డు, మెకానిక్‌ పరికరాలు ఉండాలి. ఇంజిన్‌ సామర్థ్యం బాగుండాలి. డ్రైవర్‌ అతివేగం, ప్రమాదకరంగా బస్సును నడిపితే ఫిర్యాదు చేసేందుకు వీలుగా విద్యాసంస్థల యాజమాన్యం, ప్రిన్సిపల్, బస్‌ ఇన్‌ఛార్జి సెల్‌ఫోన్‌ నంబర్లు రాయించాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. బస్సు డ్రైవర్‌కు బీపీ, సుగర్‌, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్‌ సమర్పించాలి. ఈ సర్టిఫికెట్‌ బస్సులో ఒకటి, యజమాని వద్ద ఒకటి ఉంచాలి. బస్సు అన్ని లైట్లు పనిచేయాలి. రిఫ్లెక్టివ్‌ టేపును బస్సుకు నాలుగు వైపులా అతికించాలి. బస్సుకు ఉన్న గ్లాసులు అన్నీ పటిష్టంగా ఉండేలా చూడాలి. బస్సు నుంచి పొగ రాకుండా చూడాలి. బ్రేక్‌ కండిషన్‌లో ఉండాలి. స్పీడో మీటర్‌ పనిచేయాలి. స్టీరింగ్‌, టైర్లు కండిషన్‌లో ఉండాలి. డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం ఉండాలి. 60 ఏళ్ల లోపు వయసు ఉండాలి. బస్సులో అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం ఉండాలి. బస్సులో మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలి. వారానికి ఒకసారి ప్రిన్సిపాల్‌ లేదా సంబంధిత అధికారి దీన్ని తనిఖీ చేయాలి. నెలకొకసారి పేరెంట్స్‌ కమిటీ ఈ ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ను తనిఖీ చేయాలి. దీనికోసం ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలి. బస్సులో సీట్ల కింద బ్యాగులు ఉంచుకునేందుకు అరల ఏర్పాటు ఉండాలి. సైడ్‌ విండోలకు మధ్యలో 31 అంగుళాలకు మించని దూరంలో అడ్డంగా మూడు లోహపు కడ్డీలు అమర్చి ఉండాలి. ప్రతి విద్యా సంస్థ యాజమాన్యం, ట్రాన్స్‌పోర్ట్‌, పోలీస్‌, విద్యాశాఖల సౌజన్యంతో విద్యార్థులకు ఏడాదికి ఒక రోజు రోడ్‌ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి. బస్సు ఫుట్‌ బోర్డుపై మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తుకు మించరాదు. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చబడి ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా బస్సు ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్‌లు ఏర్పాటు చేయాలి. బస్సు అటెండెంట్‌ బస్సు బయట దగ్గరగా నిలబడి విద్యార్థులు బస్సు నుంచి సురక్షితంగా దిగేలా, ఎక్కేలా చూడాలి. పాఠశాల వద్ద బస్సుల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఉండాలి. బస్సులో అటెండర్‌ ఉండాలి. సీటింగ్‌ కెపాసిటికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. శ్రీబస్సు ఎడమవైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు పొందుపర్చాలి. రూట్‌ ప్లాన్‌ బస్సులో ఉంచాలి. విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు బస్సులో ఏర్పాటు చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకాన్ని ప్రతి నెలా యాజమాన్యం తనిఖీ చేయాలి. బస్సులో అటెండర్‌ తప్పకుండా యూనిఫామ్‌ ధరించాలి.

750-School-Bus : లోపాలు….సరే సరి !

చాలా బస్సుల్లో అత్యవసర ద్వారం వద్ద సీట్లు అడ్డుగా ఉన్నాయి. హ్యాండ్‌ బ్రేక్‌లు పనిచేయట్లేదు. వాహన లొకేషన్‌ ట్రాకింగ్‌ పరికరాలు ఏ ఒక్క బస్సులోనూ లేవు. అద్దాలు సరిగా ఉండట్లేదు. సీట్లు సక్రమంగా లేవు. అత్యవసర సమయంలో ఉపయోగపడే ప్రాథమిక చికిత్స పెట్టెలున్నా.. మందులు ఉండడం లేదు. నాణ్యమైన వైరింగ్‌ లేనందున అగ్ని ప్రమాదాలకు ఆస్కారముంది. చాలా బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు కనిపించడం లేదు. పిల్లల ప్రాణాలతో ముడిపడి ఉన్న స్కూల్ బస్సుల భద్రత విషయంలో రవాణా శాఖ అధికారులు ‘మూడంచెల’ తనిఖీ విధానాన్ని తీసుకురావడం అభినందనీయం. అయితే, కేవలం స్కూళ్లు తెరిచే తొలి రోజుల్లోనే కాకుండా, విద్యాసంవత్సరం పొడుగునా ఈ తనిఖీలు నిరంతరాయంగా సాగాలి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు కేవలం కాగితాలను చూడటం కాకుండా.. బస్సు కండిషన్, డ్రైవర్ల అనుభవం, ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే యాజమాన్యాల్లో బాధ్యత పెరుగుతుంది. అప్పుడే తల్లిదండ్రుల గుండెల్లో భయం పోయి.. ‘బడి బస్సు.. భద్రతకు భరోసా’ అనే నమ్మకం కలుగుతుంది. మానవతా దృక్పథంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించి విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి రూట్ మ్యాప్ వేయాల్సిన గురుతర బాధ్యత అటు యాజమాన్యాలు, ఇటు అధికారులపై ఎంతైనా ఉంది.

750-School-Bus : 700 బస్సుల తనిఖీ చేశాం
జిల్లా రవాణా శాఖ అధికారి జి. సంజీవ్ కుమార్ వెల్లడి…!

పల్నాడు జిల్లాలో ప్రవేట్ పాఠశాలల కు సంబంధించిన 750 బస్సులలో ఇప్పటివరకు 700 బస్సులను పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి జి సంజీవ్ కుమార్ “ఆంధ్రప్రభ”కు చెప్పారు. తమకు సూచించిన నాలుగు అంశాలలో ఈ బస్సులను తనిఖీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం ప్రతి బస్సులో జిపిఎస్ లాంటివి తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నియమ, నిబంధనల మేరకు స్కూల్స్ ప్రారంభమైన తరువాత కూడా ఈ ప్రైవేటు బస్సుల తనిఖీ నిర్వహణ ఉంటుందని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.

Leave a Reply