మేడారంలో భక్తుల కోలాహలం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
మేడారంలో భక్తుల కోలాహలం.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
తాడ్వాయి, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులు ముందుగా జంపన్న వాగులో తలనీలాలు సమర్పించి, ఆపై గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క–సారలమ్మలకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు, బెల్లం, కొబ్బరికాయలు, బియ్యం, వెంట్రుకలు వంటి కానుకలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం జాతర పరిసర ప్రాంతాలైన మ్యూజియం, చిలకలగట్టు, సారలమ్మ గుడి తదితర ప్రాంతాలను సందర్శించి భక్తులు ఉల్లాసంగా గడిపారు. కొంతమంది భక్తులు మేకలు, కోళ్లను నైవేద్యంగా సమర్పించి అక్కడే వంటలు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనం చేశారు. జాతర ప్రాంతం భక్తుల రాకతో కిటకిటలాడగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది..
