దశలవారీగా బిజ్వార్ గ్రామ సమస్యల పరిష్కారం
దశలవారీగా బిజ్వార్ గ్రామ సమస్యల పరిష్కారం
ఊట్కూర్, ఆంధ్రప్రభ:
గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారీగా పరిష్కరించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని బిజ్వార్ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామ 7వ వార్డులో జీపీ నిధులతో చేపట్టిన డ్రైనేజీపై వంతెన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసి అర్హులైన పేదలకు ఇండ్లు, పింఛన్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటి వాటిని సంరక్షించి కాలుష్య రహిత వాతావరణాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
గ్రామంలోని కాలనీల్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని, గ్రామాభివృద్ధిలో ప్రజలు, యువత భాగస్వాములు కావాలని కోరారు. ఎంపీడీకే అరుణ సహకారంతో గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆంజనేయులు గౌడ్, అశోక్, తులసీదాస్, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు
