ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీతో ఆరోగ్య సందేశం
ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీతో ఆరోగ్య సందేశం
ఫిట్నెస్ను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి
నంద్యాల బ్యూరో (ఆంధ్రప్రభ): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో ఆదివారం ఉత్సాహభరితంగా సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.
జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బొమ్మలసత్రం జంక్షన్ మీదుగా క్రాంతినగర్, రైతునగర్ వరకు కొనసాగింది. అడిషనల్ ఎస్పీ స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరూ రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా సైక్లింగ్ చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చని సూచించారు. మారుతున్న జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలు, సైక్లింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. నగర వీధుల్లో సాగిన ఈ ర్యాలీకి ప్రజల నుంచి, ముఖ్యంగా క్రాంతినగర్, రైతునగర్ ప్రాంతాల వాసుల నుంచి విశేష స్పందన లభించింది.
కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, స్థానిక యువత పాల్గొన్నారు.
