విద్యార్థిని మృతిపై ఆందోళన.. కలెక్టర్ రావాలంటూ రోడ్డెక్కిన కుటుంబం
విద్యార్థిని మృతిపై ఆందోళన.. కలెక్టర్ రావాలంటూ రోడ్డెక్కిన కుటుంబం
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు..
ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత
గద్వాల, (ఆంధ్రప్రభ): జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా ఎర్రవల్లి మండల కేంద్రానికి చెందిన ఇందు (19) అనే యువతి కడుపునొప్పితో శుక్రవారం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. శనివారం ఉదయం ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే ఆపరేషన్ జరిగిన కొన్ని గంటల్లోనే ఆమె మృతి చెందింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇందు మృతి చెందిందని ఆరోపిస్తూ ఆదివారం బాధిత కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రధాన రోడ్డుపై ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచి ఆందోళనలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
బోరున విలపించిన కుటుంబ సభ్యులు
మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు రోడ్డుపైనే కూర్చొని బోరున విలపించారు. “మా బిడ్డ ప్రాణాలు పోయాయి.. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు వారిని రోడ్డుపై నుంచి తొలగించి వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా పోలీసులకు, మృతురాలి బంధువులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు ఎస్పీ, ఆర్డీవో సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
