సంపూర్ణ ఆరోగ్యానికి యోగానే మార్గం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్

సంపూర్ణ ఆరోగ్యానికి యోగానే మార్గం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్

యోగాంధ్ర-2026 ప్రారంభం..

శ్రీకాకుళం, (ఆంధ్రప్రభ బ్యూరో): ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకుని ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమాల్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదివారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్కులో నూతనంగా నిర్మించిన యోగా ఫ్లాట్‌ఫామ్‌పై ‘యోగాంధ్ర-2026’ ప్రారంభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాలను ప్రారంభించారు.

అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీస్ సంస్థల ఆధ్వర్యంలో కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు, యోగా సాధకులతో కలిసి యోగా ఆసనాలు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 21న నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా విస్తృతంగా శిక్షణ శిబిరాలు, పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 21న నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో 1,500 మందితో భారీ స్థాయిలో మెగా యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ ‘యోగాంధ్ర’ యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. కార్గిల్ పార్కులో ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు యోగా శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు.

ముఖ్యమంత్రి పిలుపును అందుకోవాలి: ఎమ్మెల్యే

ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. గత ఏడాది నిర్వహించిన యోగా కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, అదే ఉత్సాహం, స్ఫూర్తితో ఈ ఏడాది కూడా కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రధానమంత్రి యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 7వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా మండల, సచివాలయ స్థాయిల్లో యోగా శిక్షణ శిబిరాలు, పోటీలు నిర్వహించనున్నారు. జూన్ 11న మత్స్యకార గ్రామాల్లో, 16న పర్యాటక ప్రాంతమైన డచ్ బంగళా వద్ద, 19న పుణ్యక్షేత్రమైన శ్రీకూర్మంలో ప్రత్యేక యోగా ప్రదర్శనలు చేపట్టనున్నారు.

అలాగే జూన్ 7 నుంచి 9 వరకు గ్రామ స్థాయిలో, 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో, 14 నుంచి 16 వరకు జిల్లా స్థాయిలో, 18 నుంచి 20 వరకు రాష్ట్ర స్థాయిలో సోలో యోగా, ప్రాణాయామం, సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో డీపీవో స్వరూపరాణి, డీఆర్వో విశ్వేశ్వరరావు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, జెడ్పీ సీఈవో వెంకట్రామన్, యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, కొంక్యాన మురళీధర్, సందీప్, కల్పన, తంగి స్వాతి, షిర్డీ సాయి యోగ సెంటర్, సూర్య ప్రణవ పతంజలి, బ్రహ్మకుమారీస్ సంస్థల ప్రతినిధులు, యోగా సాధకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply