CM Revanth Reddy | కోహెడలో అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్..
- హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా 240 ఎకరాల్లో మెగా మార్కెట్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత కోహెడ మార్కెట్‌కే గుర్తింపు
- ఫార్చూన్-500 కంపెనీలతో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం
- రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
కోహెడ, ఆంధ్రప్రభ: హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూ.2,300 కోట్ల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మించనున్న ఈ మార్కెట్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ, రంగారెడ్డి జిల్లా రైతులు ఒకప్పుడు కష్టపడి హైదరాబాద్ ప్రజలకు పండ్లు, కూరగాయలు, పాలు అందించేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే రియల్ ఎస్టేట్ రంగం విస్తరించడంతో వ్యవసాయం క్రమంగా కుంటుపడిందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కోటి 30 లక్షల మందికి పైగా జనాభా నివసిస్తోందని, అంతర్జాతీయ నగరంగా ఎదిగినప్పటికీ ప్రజల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు ఒకేచోట అందుబాటులో ఉండేలా అత్యాధునిక వసతులతో ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తామని ఆ నాడే హామీ ఇచ్చాను..
గతంలో తాత్కాలికంగా రేకులతో షెడ్లు వేసి మార్కెట్ నిర్మించగా, గాలివానకు అవి కూలిపోయి పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారని సీఎం గుర్తుచేశారు. ఆ సమయంలో గాయపడిన రైతులను స్వయంగా పరామర్శించానని, వారికి శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆ హామీ మేరకే ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన సమీకృత పండ్ల మార్కెట్‌ను నిర్మిస్తున్నామని వెల్లడించారు. రైతులకు భద్రతతో పాటు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
పాలు, పండ్లు, కూరగాయలు వంటి వ్యవసాయ ఉత్పత్తులు ఒకేచోట అందుబాటులో ఉండేలా కోహెడలో 240 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడానికి ఈ మార్కెట్ ఉపయోగపడుతుందని చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత కోహెడ ఫ్రూట్ మార్కెట్ రాష్ట్రానికి మరో ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కొత్తిమీర వంటి సాధారణ కూరగాయలను కూడా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులు వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి వంటి పరిమిత పంటలకే పరిమితం కాకుండా కూరగాయలు, పండ్ల సాగుపై కూడా దృష్టి సారించాలని సూచించారు. కందుకూరు ప్రాంతంలో పండే టమోటాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం సాస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కూరగాయల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సీఎం విమర్శించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో వ్యవసాయ ఉత్పత్తులు లభించాలంటే స్థానికంగా ఉత్పత్తిని పెంచడంతో పాటు మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కోహెడ ఫ్రూట్ మార్కెట్ ఆ దిశగా కీలక అడుగుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫ్రూట్ మార్కెట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టును రాజకీయ కారణాలతో వ్యతిరేకించడం సరికాదన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ధైర్యంగా ముందుకు వెళ్తోందని, ఎలాంటి ఆటంకాలు వచ్చినా కోహెడ ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు.
ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన 500 కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీకి తీసుకువస్తాం..
ఫార్మా పరిశ్రమల కారణంగా కాలుష్యం పెరిగి స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఈ నగరంలో ప్రపంచ ప్రఖ్యాత ఫార్చూన్-500 కంపెనీలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు.
అయితే బీఆర్ఎస్ నాయకులు భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామని చెబుతున్నారని సీఎం విమర్శించారు. ఇదే సమయంలో రీజినల్ రింగ్ రోడ్డు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక అభివృద్ధి ప్రాజెక్టులను కూడా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ప్రతి ప్రాజెక్టును అడ్డుకోవడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
తుమ్మిడిహట్టిని నిర్మించవద్దని అంటున్నారు..
తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కూడా నిర్మించవద్దని కొందరు చెబుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రతి ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా కొందరు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.
అభివృద్ధిని నిరంతరం వ్యతిరేకిస్తూ ఇదే వైఖరి కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, ప్రజల మద్దతుతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
ఫ్రూట్ మార్కెట్ కోసం నిధులను గ్రీన్ ఛానల్ లో ఇస్తాం..
కోహెడలో నిర్మిస్తున్న అంతర్జాతీయ పండ్ల మార్కెట్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండేళ్లలోపు మొత్తం మార్కెట్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఎలాంటి ఆలస్యం లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం, ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తాం,రీజనల్ రింగ్ నిర్మిస్తాం..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపడగా అని గతంలో చెప్పిన కేసీఆర్.. ఆ హామీని నిలబెట్టుకోకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణాన్ని మాత్రం వేగంగా పూర్తిచేయాలని, ఇందుకోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 39 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి అత్యాధునిక సదుపాయాలతో సమీకృత భవన సముదాయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరైనా విమర్శలు చేసినా, శాపనార్థాలు పెట్టినా, అడ్డుకునే ప్రయత్నాలు చేసినా తెలంగాణ అభివృద్ధి ఆగదన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, కోహెడ ఫ్రూట్ మార్కెట్, రీజినల్ రింగ్ రోడ్డు వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వ్యవసాయాన్ని దండుగ అంటే పండుగ చేశాం..
వ్యవసాయాన్ని గత పాలకులు దండుగగా మార్చారని, తమ ప్రభుత్వం దాన్ని పండుగగా మార్చిందని సీఎం పేర్కొన్నారు. ఒకప్పుడు వరి వేస్తే ఉరి అని బెదిరించేవారిన.. ఇప్పుడు రైతులకు ప్రోత్సాహకంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి సాధించామని వెల్లడించారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
గతంలో రాష్ట్రంలో ఎక్కడ వరి పండినా కాళేశ్వరం నీళ్ల వల్లే సాధ్యమైందని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసేవారని, కానీ ఇప్పుడు కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు రాకపోయినా తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి సాధించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరంగా మారి లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరిలో కొట్టుకుపోయిందని ఆరోపించారు.
సాగునీటి ప్రాజెక్టులపై హరీష్ రావు తమ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేసిన సీఎం, బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన సలహాల ఫలితమే కాళేశ్వరం పరిస్థితి అని విమర్శించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులు విఫలమయ్యాయని, అందుకు బాధ్యులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
అభివృద్ధి చేయడమే కాదు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం..
2024 నుంచి 2034 వరకు రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా సమర్థంగా అమలు చేస్తామని చెప్పారు. గత పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వడంలో విఫలమైన ప్రభుత్వం స్థానంలో తమ ప్రభుత్వం ఇప్పటికే 15 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందని తెలిపారు.
రాష్ట్రంలోని 3.28 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, త్వరలో మరో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేసి మొత్తం 8 లక్షల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకుంటామని వెల్లడించారు.
అదేవిధంగా 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల రైతు రుణమాఫీ అమలు చేశామని, మహిళా సాధికారత కోసం సున్నా వడ్డీపై రూ.60 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని తెలిపారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి రూ.10 వేల కోట్ల మేర వ్యయం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
దశాబ్ద కాలంలో శతాబ్దానికి సరిపోయే విధ్వంసం చేశారు..
అసూయ, పగ, ద్వేషం ఉంటే తమ ప్రభుత్వంపై చూపించాలని, కానీ తెలంగాణ ప్రజల అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రానికి శతాబ్దానికి సరిపడా నష్టం జరిగిందని విమర్శించారు. అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోవడం, ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడటం వంటి పరిణామాలు రాష్ట్ర పురోగతిని దెబ్బతీశాయని అన్నారు.
రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని తమకు అప్పగించినప్పటికీ వెనుకడుగు వేయకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ ప్రతి సమస్యను అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నామని వెల్లడించారు సీఎం. ప్రజల కోసం అవసరమైతే ఎవరితోనైనా పోరాడేందుకు సిద్ధమని, ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు.
సమస్యల నుంచి తప్పించుకోవడం తమ విధానం కాదని, వాటిని ఎదుర్కొని పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ పడబోమని ఆయన అన్నారు.
ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసిఆర్ తోనైనా, ఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీతోనైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులు, రైతుల ప్రయోజనాల విషయంలో ఎవరినీ వదిలిపెట్టబోమని అన్నారు.
కేంద్రంలో ప్రభుత్వం ఉందని భయపెట్టాలని చూస్తే భయపడం..
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తప్పుబడుతూ, తాను అనుకోకుండా అధికారంలోకి రాలేదని, ప్రజల మద్దతుతో పోరాడి ఈ స్థాయికి వచ్చానని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన సీఎం, అవసరమైతే కేంద్రంపై మరింత ఒత్తిడి తెస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అవకాశం లభిస్తే రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చేయలేకపోతున్న కీలకమైన మెట్రో రైలు విస్తరణకు కేంద్ర అనుమతులు తీసుకువస్తామని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా సాధించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అలాగే ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాల అభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతులు తీసుకురావడానికి పోరాడతామని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తే ప్రశ్నించేందుకు వెనుకాడబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ అభివృద్ధి, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణ కోసం తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను కేంద్రంలో అధికారంలో ఉన్నామని భయపెట్టే ప్రయత్నాలు చేస్తే తాము భయపడబోమని స్పష్టం చేశారు. కొందరు నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వాటికి తగిన సమయంలో సమాధానం ఇస్తామని అన్నారు.
అయితే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో ఘర్షణకు కాకుండా సత్సంబంధాలతో ముందుకు వెళ్లాలని తమ ప్రభుత్వం భావిస్తోందని సీఎం తెలిపారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, అనుమతులను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రతి రూపాయి నిధిని తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆదాయంలో సుమారు 60 శాతం ఈ జిల్లా నుంచే వస్తోందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ద్వారా సమకూరుతున్న ఆదాయంతోనే రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అందుకే ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
