మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణ.. పోక్సో కేసు నమోదు

మంచిర్యాల, ఆంధ్రప్రభ: చెన్నూరు మండలానికి చెందిన ఓ మహిళ తన మైనర్ కుమార్తెపై లైంగిక దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూరు మండలానికి చెందిన బాలిక ఇటీవల కోటపల్లి మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. ఈ నెల 4వ తేదీ ఉదయం గ్రామంలో ఆడుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాజశేఖర్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చెన్నూరు రూరల్ సీఐ ఆర్. కృష్ణ ప్రత్యేక దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చట్టపరమైన చర్యలను వేగవంతంగా కొనసాగిస్తున్నామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply