భీమ్‌గల్ పోలీస్ స్టేషన్లో అక్రమాల ఆరోపణలు…
భీమ్‌గల్ పోలీస్ స్టేషన్లో అక్రమాల ఆరోపణలు…
- సిబ్బంది తీరుపై విమర్శలు
భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
