65,394People | భక్తిపారవశ్యంలో ఇంద్రకీలాద్రి
65,394People | భక్తిపారవశ్యంలో ఇంద్రకీలాద్రి
65,394People | అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
కనకదుర్గమ్మ దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తజనం..
శుక్రవారం ఒక్కరోజే 65,394 మందికి అమ్మవారి దర్శన భాగ్యం
11,193 దర్శన టికెట్ల విక్రయం
1.11 లక్షల ప్రసాదాల పంపిణీ
65,394People | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్నారు. కొండపై, ఘాట్‌రోడ్డు, క్యూకాంప్లెక్స్లు, ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
దేవస్థానం గణాంకాల ప్రకారం ఒక్కరోజే 65,394 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శన టికెట్ల రూపంలో 11,193 టికెట్లు విక్రయించబడగా, ఇందులో 6,957 టికెట్లు నగదు ద్వారా, 4,236 టికెట్లు ఆన్లైన్ ద్వారా జారీ అయ్యాయి. భక్తులకు 1,11,891 యూనిట్ల ప్రసాదాలు పంపిణీ చేయడం విశేషం. ప్రసాదాల విక్రయాల్లో నగదు ద్వారా 96,313 యూనిట్లు, ఆన్లైన్ ద్వారా 15,578 యూనిట్లు నమోదు అయ్యాయి. అమ్మవారిపై భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా హుండీ, విరాళాల రూపంలో గణనీయమైన ఆదాయం సమకూరింది. ఒక్కరోజే రూ.2,72,641 విరాళాలు దేవస్థానానికి అందాయి. అదే సమయంలో 698 మంది భక్తులు వివిధ సేవల్లో పాల్గొనగా, 2,726 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అన్నదాన విభాగంలో 9,500 మంది భక్తులు ప్రసాద భోజనాన్ని స్వీకరించారు.
.. ప్రత్యేక ఏర్పాట్లు..
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, దర్శన సౌకర్యాలు, ప్రసాదాల పంపిణీ, భద్రతా చర్యలను పటిష్టం చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయ ఏసీ రంగారావు నేతృత్వంలో అధికారులు పాలకమండలి సభ్యులు భక్తుల సేవలో తరించారు. శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రి భక్తి పారవశ్యంతో మునిగిపోయి, “జై దుర్గమ్మ” నినాదాలతో మారుమోగింది. కనకదుర్గమ్మ కటాక్షం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
