ఆశలను కార్యరూపంలో పెడితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి

ఆశలను కార్యరూపంలో పెడితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ పెమ్మసాని
నారాకోడూరులో సమృద్ధి కేంద్రం ప్రారంభం

ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా నారాకోడూరులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన సమృద్ధి కేంద్రాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర శనివారం ప్రారంభించారు. ఆశలను అవకాశాలుగా మార్చుకున్నప్పుడే గ్రామీణ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ స్వప్నాలకు నారాకోడూరు నాంది పలికింది అని పెమ్మసాని పేర్కొన్నారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా గ్రామ ప్రజలకు పలు ప్రభుత్వ, వైద్య, డిజిటల్ సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

ప్రారంభోత్సవం అనంతరం కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి, వైద్య పరీక్షల కేంద్రం, జన ఔషధి కేంద్రం, తంతు ఆధారిత ఇంటర్నెట్ సేవలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, వైఫై సౌకర్యం, రైతులకు డ్రోన్ల వినియోగం, భూసార పరీక్షలు తదితర సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఉపాధి కోసం యువత నగరాలకు, విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులను తగ్గించేందుకు గ్రామాల్లోనే ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు.

పాస్‌పోర్ట్ దరఖాస్తులు, ఆధార్ నవీకరణలు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, ఫోన్ రీచార్జీలు, తపాలా సేవలు వంటి అనేక సేవలు ఈ కేంద్రం ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపారు. వైద్య పరీక్షల కేంద్రంలో 60 రకాల పరీక్షలు తక్కువ ఖర్చుతో నిర్వహించే అవకాశం కల్పించామని, జన ఔషధి కేంద్రంలో మందులు మార్కెట్ ధరల కంటే తక్కువకు లభిస్తాయని చెప్పారు. రైతుల ఆదాయం పెంచేందుకు భూసార పరీక్షలు, డ్రోన్ల ద్వారా పిచికారీ సేవలు, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు నైపుణ్యాభివృద్ధి శిక్షణను వినియోగించుకోవాలని సూచించారు.

గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ యువత, విద్యార్థులు, మహిళలు, రైతులకు ఉపయోగపడే విధంగా ఈ కేంద్రం ఏర్పాటు కావడం ఆనందదాయకమన్నారు. గ్రామాల్లో వేగవంతమైన ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో విద్య, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని చెప్పారు. పదకొండు విభాగాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

కార్యక్రమంలో భాగంగా కృత్రిమ మేధ శిక్షణ పూర్తి చేసుకున్న 15 మంది విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. అలాగే వంద మంది రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టెలికాం శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply