పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలి..
భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైసమ్మ ఆలయం, ప్రధాన రహదారి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో, వర్షపాతం పెరగడంలో మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
పర్యావరణానికి విఘాతం కలిగితే ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
