వట్టేం పంప్ హౌస్ మూడో లిఫ్ట్ ను సందర్శించిన సీఎం..
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను రెండు రోజులపాటు పరిశీలిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామం వద్ద ఉన్న వట్టెం పంప్ హౌస్ మూడో లిఫ్ట్‌ను సందర్శించారు.
పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఎస్జేఆర్ఆర్ఎల్ఐఎస్)లో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అధికారులు ముఖ్యమంత్రికి ప్రాజెక్టు ఖర్చులు, పనుల పురోగతిపై వివరాలు అందించారు. 2020–2023 మధ్యకాలంలో రూ.3,300 కోట్లు ఖర్చు చేయగా, 2023 నుంచి ఇప్పటివరకు రూ.800 కోట్లు వెచ్చించి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన సివిల్ పనులను రూ.90 కోట్ల వ్యయంతో వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
పంప్ హౌస్‌లో మొత్తం 10 పంపులు ఉండగా, 5 పంపులను అమర్చి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. వర్షాకాలంలో నీరు చేరిన వెంటనే వెంకటాద్రి రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తామని అధికారులు వివరించారు.
ఈ రిజర్వాయర్ సామర్థ్యం 16.74 టీఎంసీలు కాగా, స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా విడతల వారీగా నింపనున్నట్లు తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా మొత్తం 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు నీటి అవసరాలు కూడా తీరనున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
