Norway Chess | నార్వే చెస్ టైటిల్ రేసులోకి భారత గ్రాండ్‌మాస్టర్
Norway Chess | నార్వే చెస్ టైటిల్ రేసులోకి భారత గ్రాండ్‌మాస్టర్
వరల్డ్ ఛాంపియన్ గుకేశ్‌పై సంచలన విజయం
టేబుల్ రెండో స్థానంలోకి వచ్చిన ప్రజ్ఞానంద
Norway Chess | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నార్వేలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శనతో టైటిల్ రేసులో నిలిచాడు. వరుసగా మూడు విజయాలు నమోదు చేసిన ప్రజ్ఞానంద, తాజా రౌండ్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్‌ను ఓడించి మరో సంచలనం సృష్టించాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద మొత్తం 15 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకున్నాడు. అగ్రస్థానంలో ఉన్న వెస్లీ సో కంటే కేవలం 0.5 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉండటంతో టైటిల్ పోరు చివరి రౌండ్ వరకు ఉత్కంఠభరితంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హ్యాట్రిక్ విజయాలతో..
ఈ టోర్నీలో ప్రజ్ఞానంద అత్యుత్తమ ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచ చెస్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లుగా పేరొందిన పలువురిని ఓడిస్తూ తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే మాజీ ప్రపంచ నంబర్‌వన్ మ్యాగ్నస్ కార్ల్సెన్ పై సంచలన విజయం సాధించిన ప్రజ్ఞానంద, ఇప్పుడు గుకేశ్‌ను కూడా మట్టికరిపించి టైటిల్ ఆశలను మరింత బలపరచుకున్నాడు. వరుస విజయాలతో అతని ఆత్మవిశ్వాసం పెరిగినట్లు కనిపిస్తోంది. కీలక దశలో సాధించిన ఈ విజయాలు భారత చెస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
గుకేశ్‌కు ఎదురుదెబ్బ
ప్రపంచ ఛాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టిన గుకేశ్‌కు ఈ పోటీలు ఆశించిన విధంగా సాగడం లేదు. ప్రజ్ఞానంద చేతిలో ఓటమి పాలైన తర్వాత ఆయన పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయాడు. ప్రపంచ ఛాంపియన్‌పై ప్రజ్ఞానంద సాధించిన విజయం ఈ టోర్నీలోనే అత్యంత కీలక ఫలితాల్లో ఒకటిగా విశ్లేషకులు భావిస్తున్నారు.
టైటిల్ రేసు ఉత్కంఠ
పట్టికలో అగ్రస్థానంలో ఉన్న వెస్లీ సోకు, ప్రజ్ఞానందకు మధ్య కేవలం అర పాయింట్ తేడా మాత్రమే ఉండటంతో చివరి రౌండ్ ఫలితాలు టైటిల్ విజేతను నిర్ణయించనున్నాయి. ప్రజ్ఞానంద తన విజయం పరంపరను కొనసాగిస్తే నార్వే చెస్ టైటిల్ గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయి.
మహిళల విభాగంలో..
నార్వే చెస్ మహిళల విభాగంలో భారత్ నుంచి ఎవరూ టైటిల్ రేసులో నిలవలేదు. దివ్య దేశ్‌ముఖ్ ఐదో స్థానం, కోనేరు హంపి 6వ స్థానంలో నిలిచారు. కజికిస్థాన్కు చెందిన బిబిసారా అస్సౌబయేవా అగ్రస్థానంలో ఉంది. ఆమె ఖాతాలో ఇప్పటికే 16.5 పాయింట్లు ఉన్నాయి. తర్వాత జు జినెర్ (13) ఉన్నప్పటికీ.. పాయింట్ల మధ్య అంతరం చాలా ఉంది. దీంతో చివరి రౌండ్ ఫలితంతో సంబంధం లేకుండానే బిబిసారా టైటిల్‌ను నెగ్గినట్లే.
