Doctors Transfer Violations | హైదరాబాద్‌ను వదలని వైద్యులు.. బదిలీల్లో నిబంధనలకు తూట్లు?

హైదరాబాద్‌ను వదలని వైద్యులు.. బదిలీల్లో నిబంధనలకు తూట్లు?

Doctors Transfer Violations | దశాబ్దాలుగా హైదరాబాద్‌లోనే కీలక వైద్యులు

బదిలీ నిబంధనల అమలుపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

అధికారులకు మినహాయింపులు.. కింది స్థాయి ఉద్యోగులపై భారం

వైద్య ఆరోగ్యశాఖ బదిలీలపై విచారణ డిమాండ్

Doctors Transfer Violations | హైదరాబాద్, ఆంధ్రప్రభ: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఎంతోమంది కీలక ఉద్యోగులు హైదరాబాద్‌ను వదిలి వెళ్లనంటున్నారు. పోస్టింగ్ నుంచి…. రిటైర్మెంట్ వరకూ అక్కడే పాతుకుపోతున్నారు. తమకున్న పరిధిలో పైరవీలు చేసుకుంటూ తమ స్థానాలను పదిలపర్చుకుని ఎలాగోలా కాలం నెట్టుకొచ్చేస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖలో జరిగిన బదిలీల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఉద్యోగ సంఘాల నేతల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఎన్నో ఏళ్ల క్రితం నియమితులైన వైద్యుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వం చేపట్టే బదిలీలకు సంబంధించి నిబంధనలు ఇక్కడ అమలు కాకపోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జరిపే సాధారణ బదిలీల్లోనూ వీరికి స్థానచలనం లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

నాలుగేళ్లకు పైగా పని చేసిన సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలోని జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లను తప్పనిసరిగా బదిలీ చేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ అవి అమలు కాకపోవడం వివాదాస్పదంగా మారింది.

శాఖ ఏదైనా… జరిగేది అదే!

వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్, హెల్త్ డైరెక్టర్, ఆయుష్ విభాగాల్లోని ఒకే స్థానంలో నాలుగేళ్లకు పైగా పని చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చెయ్యాలన్నది ప్రభుత్వ నిబంధన. మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నవారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నది ఉత్తర్వుల్లో కీలకం.

కానీ హైదరాబాద్‌లో పని చేస్తున్న డైరెక్టర్లతో పాటు వివిధ విభాగాల్లో పని చేస్తున్న వైద్య అధికారులు, వైద్యులను బదిలీ చెయ్యకుండా ఉన్నతాధికారులు మినహాయించడం పై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2024 సాధారణ బదిలీల్లోనూ వీరికి మినహాయింపు ఇచ్చినట్లు ఉన్నతాధికారులు పేర్కొనడం విశేషం.

అధికారులకు మినహాయింపు ఇచ్చినట్టే తమకూ ఇవ్వాలని స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా జరిగిన బదిలీలపై సమగ్ర విచారణ జరిపించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

వైద్య ఆరోగ్యశాఖ బదిలీల్లో ఆర్థిక, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి బదిలీ చేయకుండా కింది స్థాయి ఉద్యోగులను ఇష్టానుసారంగా బదిలీ చేశారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వీటిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.

Leave a Reply