Saraswati River | పుణ్యం సంగతి దేవుడెరుగు…
Saraswati River | పుణ్యం సంగతి దేవుడెరుగు…
- పర్యావరణానికి చేటు మహాపాపం..
- ఇది ఎవరి తప్పు..
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- దీన్ని అడ్డుకునేది ఎలా..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లోని పవిత్ర సరస్వతి నది (Saraswati River) వద్ద జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులు… భక్తి పేరుతో చేస్తున్న పనులు పర్యావరణానికి ఎంత చేటు తెస్తున్నాయో చూపిస్తూ ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఏకంగా 4.1 కోట్లకు పైగా వీక్షణలు (41+ Million Views) రావడం విశేషం.
మానా గ్రామంలో వెలుగుచూసిన దృశ్యాలు
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ సమీపంలోని మానా గ్రామం (Mana Village) వద్ద ప్రవహించే సరస్వతి నది ఒడ్డున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం, మానా గ్రామానికి వచ్చే భక్తులు పూలు, పూజా సామాగ్రితో పాటు ప్లాస్టిక్ కవర్లను కూడా నదిలోకి విచ్చలవిడిగా విసిరేస్తున్నారు. ఫలితంగా నది ఒడ్డున ఉన్న భారీ రాళ్లపై చెత్త పేరుకుపోయి, పవిత్ర పుణ్యక్షేత్రం కాస్తా చెత్తకుప్పను తలపించేలా మారింది. దీంతో ఒకప్పుడు నిర్మలంగా కనిపించిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ‘ప్లాస్టిక్ వైరస్’ వదల్లేదని స్థానికులు, నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భక్తి కూడా బిజినెస్ అయ్యిందా…
నదుల్లో పూలు, పసుపు, కుంకుమ, నాణేలు సమర్పించడం అనేది భారతీయ సంప్రదాయాల్లో భాగంగా చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే ఈ ఆచారాలు పర్యావరణానికి హాని కలిగించకుండా కొనసాగించడం ఎలా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇలా చేయకండి అని భక్తులకు చెబితే.. మా నమ్మకాలను ప్రశ్నిస్తారా? అంటూ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పూజా సామాగ్రిని ప్లాస్టిక్ ప్యాకెట్లలో విక్రయించడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
దేవుడిపై మనకున్న భక్తిని కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. పూజా సామాగ్రిని విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లు, సింథటిక్ ప్యాకెట్లలో పెట్టి అమ్మడం వల్లే ఈ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. భక్తులు ప్యాకెట్ కొంటున్నారు.. అలాగే నదిలోకి విసిరేస్తున్నారు. భక్తులు తమ విశ్వాసంతో పూజా సామాగ్రిని సమర్పిస్తున్నప్పటికీ, వాటి ప్యాకేజింగ్‌లో వినియోగిస్తున్న ప్లాస్టిక్ పదార్థాలు కాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. దీంతో కేవలం భక్తులనే తప్పుబట్టడం కాకుండా, ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న వ్యాపార విధానాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సమస్యకు పరిష్కారాలు ఇవే!
పుణ్యక్షేత్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని కీలక చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. పూజా సామాగ్రిని పూర్తిగా ఎకో-ఫ్రెండ్లీ ప్యాకేజింగ్‌లో మాత్రమే విక్రయించే విధంగా నిబంధనలు తీసుకురావడం, నదీ ఘాట్ల వద్ద ప్రత్యేక అర్పణ కుండీలు ఏర్పాటు చేయడం, పూజా వ్యర్థాలను సేకరించి కంపోస్టింగ్ లేదా రీసైక్లింగ్ చేయడం వంటి చర్యలు ఫలితాలివ్వగలవని చెబుతున్నారు.
అదే విధంగా నదుల్లో పడే నాణేలను సేకరించేందుకు ప్రత్యేక గ్రిడ్ వ్యవస్థలు ఏర్పాటు చేయడం, ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడం, భక్తుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం కూడా అవసరమని సూచిస్తున్నారు.
నదుల్లో చెత్త వేయకుండా ఉండటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పూజా సామాగ్రిని నిర్ణీత ప్రదేశాల్లోనే సమర్పించడం వంటి విషయాల్లో భక్తులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పర్యావరణ పరిరక్షణ కూడా ఒక విధంగా దైవసేవే అనే భావనను ప్రజల్లో పెంపొందించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు
