కాజీపేట రైల్వే డివిజన్ వెంటనే ప్రకటించాలి
కాజీపేట రైల్వే డివిజన్ వెంటనే ప్రకటించాలి
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: కడియం శ్రీహరి
రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టు అయినా తెచ్చారా..?
సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని మండిపాటు
స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ: కాజీపేట రైల్వే డివిజన్‌ను తక్షణమే ప్రకటించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ జూన్ 1 నుంచి ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. నూతన రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. అదే సమయంలో, తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌గా ఉన్న కాజీపేట రైల్వే డివిజన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుతో ఉమ్మడి వరంగల్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కడియం తెలిపారు. కాజీపేటకు రైల్వే డివిజన్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలు, అటవీ సంపద, జల వనరులు, సారవంతమైన భూములు ఉన్నాయని పేర్కొన్నారు.
గత 12 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే ప్రధాని మోదీకి, బీజేపీకి ఇష్టం లేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించడమే బీజేపీ ధోరణిగా మారిందన్నారు. బీజేపీకి నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే వెంటనే ఒక జాతీయ ప్రాజెక్టుతో పాటు కాజీపేట రైల్వే డివిజన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేకపోయారని కడియం విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే వారికి మంత్రి పదవులు ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు తెచ్చామని చెబుతున్న బీజేపీ నేతలు, ఆ నిధులతో ఏ పనులు జరిగాయో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి ఇస్తే తిరిగి రాష్ట్రానికి 32 పైసలు మాత్రమే వస్తున్నాయని పేర్కొన్నారు.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, జాతీయ ప్రాజెక్టులు, బడ్జెట్లో అదనపు నిధులు ఇస్తున్న కేంద్రం, తెలంగాణకు మాత్రం హక్కుగా రావాల్సిన నిధులు తప్ప అదనంగా ఏమీ ఇవ్వడం లేదని కడియం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు బీజేపీ నాయకులు తెలంగాణకు ఏమి తెచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా కడియం శ్రీహరి తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని “తెలంగాణ ద్రోహి” అని సంబోధించడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని అన్నారు. అధికారం పోయిందనే అసహనంతో ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల పరుష పదజాలం ఉపయోగించడం తగదని, కేటీఆర్ ఇప్పటికైనా తన భాషను మార్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
