భక్తిశ్రద్ధలతో లక్ష్మీ గణపతి హోమం

భక్తిశ్రద్ధలతో లక్ష్మీ గణపతి హోమం

-శ్రీ విఘ్నేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు
-150 మంది దంపతులతో సామూహిక హోమం..

గుడివాడ, ఆంధ్రప్రభ: గుడివాడ పట్టణంలోని మెయిన్‌ రోడ్డులో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవాలయంలో సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమ పూజలు భక్తిశ్రద్ధలతో సాగాయి.

దేవస్థాన మండపంలో నిర్వహించిన ఈ సామూహిక హోమంలో 150 మంది దంపతులు జంటలుగా పీటలపై కూర్చొని పూజల్లో పాల్గొన్నారు. లోక కల్యాణార్థం, ప్రజల శ్రేయస్సు కోసం సంకటహర చతుర్థి ప్రత్యేకతను పురస్కరించుకొని లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహించినట్లు దేవస్థానం ధర్మకర్తల కమిటీ చైర్మన్ శాయన రాజేష్ తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ హోమ పూజల్లో దేవస్థానం ఈవో యార్లగడ్డ వాసు, ధర్మకర్తల కమిటీ సభ్యులు లోయ వాసు, పంచుమర్తి శ్రీనివాసరావు, రమణమూర్తి, పోతురాజు, వీరమాచినేని శైలజ, విజయలక్ష్మి, శారద, దుర్గాభవాని, గణపతి శాస్త్రితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply