గాలివాన బాధితులకు గద్దె క్రాంతి అండ

గాలివాన బాధితులకు గద్దె క్రాంతి అండ

నాలుగు కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సాయం.. కూలిన చెట్టు తొలగింపునకు చర్యలు

పటమట, ఆంధ్రప్రభ: మంగళవారం వీచిన ఈదురు గాలులు, వర్షాలకు విజయవాడ 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్‌లోని రాయపాటి సత్తియ్య వీధి ఎదురుకాలువ కట్ట వెంబడి ఉన్న భారీ మర్రి చెట్టు కూలి నాలుగు ఇళ్లు దెబ్బతిన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ బుధవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని గద్దె క్రాంతి కుమార్‌ను ఆదేశించారు.

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గద్దె క్రాంతి కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాలుగు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని తన సొంత నిధుల నుంచి అందజేశారు. కూలిపోయిన చెట్టును తొలగించేలా సంబంధిత అధికారులతో గద్దె క్రాంతి కుమార్ మాట్లాడారు. చెట్టు తొలగింపునకు అవసరమైన పరికరాలను అందించారు.

ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ, గాలివానల కారణంగా ఇళ్లకు నష్టం వాటిల్లిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆదేశాల మేరకు తక్షణ సహాయం అందించామని తెలిపారు. ప్రభుత్వం నుంచి కూడా బాధితులకు తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల కష్టసుఖాల్లో ముందుండే నాయకత్వం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌దని గద్దె క్రాంతి కుమార్ అన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. వర్షాకాలంలో ఈదురు గాలులు, గాలివానలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రమాదకర పరిస్థితులు కనిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. ఆస్తి నష్టాన్ని ఏదో ఒక రూపంలో పూడ్చుకోవచ్చుగానీ, ప్రాణ నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి రమేష్, గాదిరెడ్డి అమ్ములు, వంశీ, కెల్లా రమేష్, సత్యనారాయణ, కె. శేషుబాబు, సుబ్రహ్మణ్యం, నరసింహా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply