APCNF I ప్రపంచ వేదికపై ఏపీ ప్రకృతి వ్యవసాయానికి అరుదైన గౌరవం

APCNF I ప్రపంచ వేదికపై ఏపీ ప్రకృతి వ్యవసాయానికి అరుదైన గౌరవం

APCNF I ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

APCNF I అమరావతి, ఆంధ్రప్రభ: ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక పర్యావరణ పురస్కారంగా గుర్తింపు పొందిన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్–2026 ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం APCNFకు లభించడం రాష్ట్రానికే కాకుండా దేశానికీ గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ గుర్తింపుతో ప్రకృతి వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, రైతులు, గ్రామీణ మహిళల అంకితభావంతో కూడిన కృషికి ప్రపంచ వేదికపై లభించిన గౌరవమే ఈ పురస్కారమని మంత్రి వివరించారు.

ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు, గ్రామీణ మహిళలు, ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు అంకితం చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. జూన్ 2న స్వీడన్‌లోని బస్తాద్ నగరంలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహణ అధికారి తల్లం విజయ్ కుమార్ పాల్గొని ఈ అవార్డును స్వీకరించారు. ప్రపంచ ఆహార వ్యవస్థలో పర్యావరణ అనుకూల మార్పులకు దోహదపడుతున్న వినూత్న కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశంలో దశాబ్దం క్రితం ప్రారంభమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అతిపెద్ద వ్యవసాయ పర్యావరణ కార్యక్రమాల్లో ఒకటిగా ఎదిగిందని మంత్రి అన్నారు. ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను అమలు చేయడం ద్వారా వాతావరణ మార్పులు, పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవచ్చని APCNF నిరూపించిందని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం రైతులకు అధిక దిగుబడులు, మెరుగైన ఆదాయాన్ని అందించడమే కాకుండా నేల సారాన్ని పెంపొందించడం, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నమూనా దేశంలోని 21 రాష్ట్రాలతో పాటు శ్రీలంక, జాంబియా దేశాల్లోనూ అమలవుతోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రూపొందించిన ప్రకృతి వ్యవసాయ విధానం ప్రపంచవ్యాప్తంగా ఆచరణీయమని ఇది నిరూపిస్తోందన్నారు.

మహిళల నాయకత్వం ఈ ఉద్యమ విజయానికి ప్రధాన బలంగా నిలిచిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళలు కుటుంబ స్థాయిలో ఆలోచనా విధానంలో మార్పు తీసుకువచ్చి, రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తున్న 10 వేల మందికిపైగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ల సేవలు అభినందనీయమని తెలిపారు.

ప్రకృతి వ్యవసాయ శాస్త్రాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న 1,000 మందికిపైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికిపైగా రైతు పరిశోధకుల సేవలను ప్రత్యేకంగా గుర్తిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ విజయ ప్రయాణంలో వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, క్షేత్రస్థాయి అధికారులు, శాస్త్రవేత్తలు, సిబ్బంది అందించిన సహకారం అమూల్యమని అన్నారు.

వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, కేఎఫ్‌డబ్ల్యూ జర్మన్ బ్యాంక్ అందించిన సహకారానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్, కో-ఇంపాక్ట్ సంస్థలతో పాటు ఈ కార్యక్రమానికి తోడ్పడిన జాతీయ, అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ అంతర్జాతీయ గుర్తింపు ద్వారా ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రపంచ దేశాలతో జ్ఞాన మార్పిడి, పరిశోధన భాగస్వామ్యాల విస్తరణ, రైతు శాస్త్రవేత్తలకు మరింత ప్రోత్సాహం, ప్రదర్శన క్షేత్రాల అభివృద్ధి వంటి కార్యక్రమాలకు ఈ అవార్డు బలమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఇది కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదని, సుస్థిర వ్యవసాయం, రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతికి ప్రపంచం అందించిన గౌరవమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఉద్యమాన్ని విశ్వసించి అభివృద్ధికి తోడ్పడిన ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply