గ్రామీణ ఆరోగ్య సేవలు మరింత పటిష్టం
గ్రామీణ ఆరోగ్య సేవలు మరింత పటిష్టం
విస్సన్నపేటలో విలేజ్ హెల్త్ క్లినిక్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి
విస్సన్నపేట, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో విస్సన్నపేట-1 పట్టణంలో నిర్మాణంలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ పనులను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. నిర్మాణ పురోగతి, నాణ్యత ప్రమాణాలు, భవిష్యత్తులో అందించబోయే వైద్య సేవలపై సంబంధిత అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. క్లినిక్ భవనం పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేరువ చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. సాధారణ ఆరోగ్య పరీక్షలు, తల్లి-శిశు సంరక్షణ సేవలు, ప్రాథమిక చికిత్సలు, ఆరోగ్య సలహాలు ఒకే చోట అందించే విధంగా ఈ హెల్త్ క్లినిక్ సేవలు ఉండనున్నాయని చెప్పారు.
నిర్మాణ పనుల్లో ఎటువంటి రాజీ లేకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
అనంతరం స్థానిక ప్రజలతో ఎమ్మెల్యే మమేకమయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతానికి ఈ హెల్త్ క్లినిక్ నిర్మాణం మరో అడుగుగా నిలవనుంది.
