తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..
తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు. చెరువులు, వాగులు, కాలువల సమీపంలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
