పుష్కరాలకు వెళ్తుండగా కారు ప్రమాదం
పుష్కరాలకు వెళ్తుండగా కారు ప్రమాదం
ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
వెంకటాపూర్, ఆంధ్రప్రభ: మండలంలోని పాలంపేట పరిధిలోని నల్లగుంట క్రాస్‌రోడ్ వద్ద సోమవారం రాత్రి జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పుణ్యం వీరస్వామి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై చల్ల రాజు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. పాకాల కొత్తగూడెం మండలం గార్ల గ్రామానికి చెందిన పుణ్యం వీరస్వామి, తన స్నేహితులు బానోతు సుధీర్ సింగ్, ఈసాల రవికుమార్‌తో కలిసి కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు కారులో వెళ్తున్నారు.
వారు ప్రయాణిస్తున్న కారు నల్లగుంట క్రాస్‌రోడ్ వద్దకు రాగానే అతివేగం కారణంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పుణ్యం వీరస్వామి, బానోతు సుధీర్ సింగ్, ఈసాల రవికుమార్‌కు బలమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో ములుగు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పుణ్యం వీరస్వామి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. వీరస్వామి తమ్ముడు పుణ్యం అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడు పుణ్యం వీరస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
