Rs84 cr | గేటు కష్టాలకు శాశ్వత పరిష్కారం

Rs84 cr | గేటు కష్టాలకు శాశ్వత పరిష్కారం
Rs84 cr | పల్నాడు, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. రూ.84 కోట్ల అంచనా వ్యయంతో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవో జారీ చేసింది. దీంతో రైల్వే గేట్ల వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగు పడింది.
పెదకూరపాడు (ఎల్సీ నంబర్ 27), సత్తెనపల్లి–రెడ్డిగూడెం మధ్య (ఎల్సీ నంబర్ 40) ప్రాంతాల్లో ఈ రెండు భారీ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి టెండర్లు విడుదలయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే (గుంటూరు డివిజన్) శనివారం ఈ-టెండర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టుకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాంత ప్రజలు రైల్వే గేట్ల వద్ద నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
రూ.84.09 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుల పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ బ్రిడ్జ్‌లు అందుబాటులోకి వస్తే రైలు రాక సమయంలో వాహనాలు గంటల తరబడి ఆగాల్సిన అవసరం ఉండదని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు సహా వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు.
