తల్లిదండ్రులే గురువులు, ప్రత్యక్ష దైవాలు..

తల్లిదండ్రులే గురువులు, ప్రత్యక్ష దైవాలు..
అందరినీ కదిలించాయి
సంస్థాన్ నారాయణపురం ఆంధ్రప్రభ: తల్లి, తండ్రి, గురువు, అతిథి ప్రత్యక్ష దైవాలని యోగరత్న ఆచార్య రమేష్ గురూజీ అన్నారు. వారిని గౌరవించి, వారి ఆశీస్సులు పొందడం జీవితంలో అత్యంత ముఖ్యమని సూచించారు.
సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గుట్టల మధ్య ఉన్న బ్రీత్ మౌంటెయిన్ రిట్రీట్ సెంటర్ (అరబిందో ఆశ్రమం)లో ఆచార్య రవీందర్ బాపూజీ ఆధ్వర్యంలో పిల్లల కోసం నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో భాగంగా శనివారం “పాదపూజ” ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిబిరంలో పాల్గొంటున్న పిల్లల తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
తల్లిదండ్రులే కనిపించే దైవాలనే భావనతో పిల్లలు వారి పాదాలను వివిధ నదుల నుంచి తెచ్చిన జలాలతో కడిగారు. అనంతరం పసుపు, కుంకుమలతో అలంకరించి పూలమాలలు వేసి నమస్కరించి ఆశీర్వాదాలు పొందారు.
పిల్లల భక్తి, ప్రేమాభిమానాలకు కదిలిపోయిన తల్లిదండ్రులు వారి తలలపై మంగళాక్షతలు వేసి ఆశీర్వదించారు. తమ గుండెలకు హత్తుకుని ఎల్లప్పుడూ తోడునీడగా ఉంటామని ప్రేమను చాటుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు పండ్లు తినిపించగా, పిల్లలు కూడా తమ తల్లిదండ్రులకు పండ్లు తినిపిస్తూ ఆప్యాయతను పంచుకున్నారు.
తెలిసి, తెలియక చేసిన తప్పులను క్షమించాలని పిల్లలు తమ తల్లిదండ్రులను వేడుకున్నారు. ఇకపై వారి మాట వింటూ, వారి మార్గదర్శకత్వంలో నడుస్తామని, జీవితాంతం అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
భావోద్వేగభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, పిల్లలు అరుదైన అనుభూతిని పొందారు. పాదపూజలో పాల్గొన్న వారిపై రవీందర్ బాపూజీ, రమేష్ గురూజీ, వెంకటేశ్వర బాపూజీ, శివకుమారి అమ్మ, వనజ లక్ష్మి అమ్మలు పుష్పవర్షం కురిపించారు. అరబిందో ఆశ్రమం మేనేజర్ సలాం ఆజాద్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ప్రకృతి ఒడిలో విలువల బాట
సిద్ధ సమాధి యోగ గురువు ఆచార్య రవీందర్ బాపూజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిబిరంలో పిల్లలకు సూర్య నమస్కారాలు, యోగా, ధ్యాన సాధన బోధిస్తున్నారు.
కొలనులో ఈత, ప్రకృతి మధ్య ట్రెక్కింగ్, అడవి మార్గాల్లో నడక, సాహస క్రీడలు, విలువిద్య వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు గుట్టల మధ్య ఏర్పాటు చేసిన జిప్లైన్పై ప్రయాణించడం, రాచకొండ రాజుల కాలం నాటి కట్టడాలను సందర్శించడం ద్వారా చరిత్రపై అవగాహన కల్పిస్తున్నారు.
రసాయన రహిత ప్రకృతి సేద్యంతో పండించిన ఆహారాన్ని అందిస్తూ, గిరిజనులు, రైతుల జీవన విధానాన్ని పరిచయం చేస్తున్నారు. వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
పట్టణ జీవనానికి దూరంగా, ప్రకృతి ఒడిలో నిర్వహిస్తున్న ఈ శిబిరం పిల్లలకు విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ, జీవన విలువలను అందిస్తోందని నిర్వాహకులు తెలిపారు.
