ఆసరాగా అందిన చేయూత..

ఆసరాగా అందిన చేయూత..

మారనున్న ఎన్నో కుటుంబాల భవిష్యత్తు

నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ఆర్థికంగా వెనుకబడిన మహిళల సాధికారత కోసం రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక అభ్యాస పాఠశాలలో శనివారం “రోటరీ ఆసరా” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా 60 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు, 50 గ్యాస్ ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. వికలాంగుల కోసం ఐదుగురికి ట్రైసైకిళ్లను అందజేశారు.

ఈ సందర్భంగా రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడు పాకాల నరసింహారావు మాట్లాడుతూ, సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

కుట్టు మిషన్ల పంపిణీ కేవలం సహాయం మాత్రమే కాదని, అనేక కుటుంబాలకు ఆత్మవిశ్వాసం, ఉపాధి అవకాశాలు, మెరుగైన భవిష్యత్తుకు మార్గం చూపే ప్రయత్నమని పేర్కొన్నారు. మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, ఒక మహిళ ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్.వి. రాంప్రసాద్ (ఆర్‌ఐడీ-3150) హాజరయ్యారు. గౌరవ అతిథులుగా నిజామాబాద్ ఆర్డీవో కే. రాజేంద్ర కుమార్, పీడీజీ రమేష్ వంగాల, రొటేరియన్ హరిప్రసాద్, రొటేరియన్ కేఎస్‌ఆర్‌కే ప్రసాద్, రొటేరియన్ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రాజెక్టు చైర్మన్‌గా రొటేరియన్ డాక్టర్ పి. విష్ణుబాబు, ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా రొటేరియన్ రంజిత్ సింగ్ ఠాకూర్ వ్యవహరించారు.

కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు కళ్యాణ్ చక్రవర్తి పంగులూరు, కార్యదర్శి లక్ష్మీ విసిరెడ్డి, రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ కార్యదర్శి గంజి రమేష్, కోశాధికారి పాల్తి రచిత్ కుమార్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply