తరాల పాటు గుర్తుండే నిర్ణయం ఏది?

తరాల పాటు గుర్తుండే నిర్ణయం ఏది?
నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ మహానాడు చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించారని, మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ప్రకటన మహిళా లోకం మరువలేని సంఘటనగా నిలుస్తుందని నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.
శనివారం శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో నిర్వహించిన ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన మహానాడు కనులపండువగా జరిగిందని అన్నారు.
గతంలో మహానాడుకు సుమారు ఐదు లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యేవారని, ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో డిజిటల్, హైబ్రిడ్ విధానంలో క్లస్టర్ల వారీగా నిర్వహించగా 17 లక్షల మంది కార్యకర్తలు నమోదు చేసుకుని పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించారని తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్ఫూర్తితో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా నారా లోకేష్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే నిర్ణయమని అన్నారు.
కొంతమంది వైసీపీ నాయకులు మహిళలకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారని, అలాంటి వారికి సమాధానంగా మహిళలు కేవలం ఓటర్లుగానే కాకుండా నాయకులుగా ఎదగాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
మహిళల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేస్తూ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపనతో పాటు మహిళలకు ఆస్తి హక్కులు కల్పించిన ఘనత ఆయనదేనని చెప్పారు.
ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు ఉద్యమాన్ని బలోపేతం చేసి, లక్షలాది మంది మహిళలను స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగాల వైపు నడిపించారని తెలిపారు. రాష్ట్రంలో 12 లక్షల డ్వాక్రా సంఘాలు, కోటి మందికి పైగా సభ్యులతో మహిళా సాధికారతకు బాటలు వేసిన నాయకుడిగా చంద్రబాబు నిలిచారని అన్నారు.
మహిళల విద్య కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడితే, రాజకీయ నాయకత్వం దేశాభివృద్ధికి దోహదపడుతుందని నారా లోకేష్ భావిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని మరింత పెంచే దిశగా మహానాడు చారిత్రక వేదికగా నిలిచిందని అన్నారు.
తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా నారా లోకేష్ మహిళా పక్షపాతిగా నిలిచారని డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
