ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
- ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్
- ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో..
- పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
- సంక్షేమం–అభివృద్ధి రెండింటికీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం
- ప్రజల అభిప్రాయాలతోనే తదుపరి కార్యాచరణ
భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, గత రెండు సంవత్సరాలుగా ప్రజా సంక్షేమాన్ని ఏ మాత్రం విస్మరించకుండా అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు.
ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు కూడా సకాలంలో నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి విడతల వారీగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. వేల కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసి మిగిలిన ఇళ్లను కూడా త్వరలో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సేవలతో పాటు సుజనా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నామని చెప్పారు.
ప్రతి శని, ఆదివారాల్లో ఉచిత సంచార వైద్య వాహనం ద్వారా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. విద్యా రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలో నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా అందిన ప్రతి అర్జీపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
