HYDRA transgender jobs | 16 మంది ట్రాన్స్‌జెండర్లకు అవకాశం

HYDRA transgender jobs | 16 మంది ట్రాన్స్‌జెండర్లకు అవకాశం
HYDRA transgender jobs | చెరువులు, నాలాల సంరక్షణలో కీలక పాత్ర
ఉద్యోగంతో జీవితాల్లో కొత్త వెలుగు
త్వరలో 350 మంది ట్రాఫిక్ అసిస్టెంట్ల నియామకం
HYDRA transgender jobs | హైదరాబాద్, ఆంధ్రప్రభ: సమాజం వారిని చిన్నచూపు చూసినా… హైడ్రా పెద్దమనసు చేసుకుంది. తమ సంస్థలో ఉద్యోగావకాశం కల్పించింది. ఈ నిర్ణయం ఓ కొత్త సంస్కరణకు దారితీసింది. హైడ్రాలో ఉద్యోగం ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది. కొలువు తెచ్చిన గౌరవం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక వారు వెనక్కి చూడడం లేదు. విధులు ఎక్కడైనా.. ఎప్పుడైనా సిద్ధమంటున్నారు.
చెరువులు, నాలాల కబ్జాలను తొలగించడంలో భాగస్వామ్యమవుతున్నారు. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో ముందుంటున్నారు. మొత్తం 16 మంది ట్రాన్స్‌జెండర్లకు హైడ్రా అవకాశం కల్పించింది. ఇందులో ట్రాన్స్ ఉమెన్ 11 మంది ఉంటే.. ట్రాన్స్‌మెన్ ఐదుగురు ఉన్నారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వెరవకుండా.. విధులు నిర్వహించి ప్రజల ఆస్తులు కాపాడడంలో భాగస్వామ్యమవుతున్నారు.
హైడ్రాలో మాకు దక్కిన ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, తమ జీవితాలకు కొత్త గుర్తింపు అని వారు అంటున్నారు. హైడ్రా యూనిఫామ్ వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నామని అంటున్నారు. హైడ్రా ఈగల్ టీమ్ అని నామకరణం చేసి.. విధుల్లో భాగస్వాములను చేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు.
మా జీవితానికి కొత్త వెలుగు
మా జీవితాల్లో డబ్బుకంటే గౌరవమే ముఖ్యమైంది. ఇప్పుడు హైడ్రా యూనిఫాం వేసుకుని బయటికి వెళ్తే గౌరవంగా ఉంది. అది మా జీవితంలో పెద్ద మార్పు. అవకాశం ఇస్తే ట్రాన్స్‌జెండర్లు ఏ రంగంలోనైనా రాణిస్తారు. హైడ్రాలో మా విధులు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. హైడ్రాలో అధికారులతో పాటు.. ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు. విధులు నిర్వర్తించడంలో సమానంగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, హైడ్రా కమిషనర్‌కు ధన్యవాదాలు.
– గాయత్రి
హైడ్రా ఈగల్ టీమ్ సేవలు
కబ్జాదారులు ఎంతటి వారైనా.. హైడ్రా వెనుకడుగు వేయదు. ఆ ధైర్యంతో ఈగల్ టీమ్ పని చేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం, ఐలాపూర్‌లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంలో ట్రాన్స్‌జెండర్లు చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల మాదాపూర్‌లో ఈదులకుంటను కాపాడడంలో చురుకైన పాత్ర పోషించారు.
ప్రజలకు నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పడం, అధికారులు-ప్రజల మధ్య సమన్వయం చేయడం వంటి పనుల్లో వారు ప్రత్యేక పాత్ర పోషించారు. వారిలో సహనం ఎక్కువ. భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణం ఉంది. అందుకే ఫీల్డ్‌లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు అని హైడ్రా అధికారులు ప్రశంసిస్తున్నారు. నెల జీతం వస్తోంది. సమాజంలో గౌరవం పెరిగింది. ముఖ్యంగా తాము కూడా ఉద్యోగానికి పనికొస్తామన్న నమ్మకం వారిలో బలపడింది.
హైడ్రాతో ప్రత్యేక గుర్తింపు
ప్రకృతిలో అందరూ భాగమే. ఆ ప్రకృతిని రక్షించడంలో మేము భాగస్వాములం అయ్యాం. పార్కులు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. హైడ్రాలో పని చేయడంతో మాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. హైడ్రా అంటే ప్రజలకు ఎంతో విశ్వాసం.. ఆ సంస్థలో మేము భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషంగా ఉంది.
– రుచిత
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా మరో 350 మంది ట్రాన్స్‌జెండర్లు
ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి తొలుత రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 39 మందిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా చేర్చుకుంది. అనంతరం మెట్రోలో పింక్ వింగ్ గార్డ్స్‌గా ఇటీవల 20 మందికి ఉద్యోగాలు కల్పించారు. హైడ్రాలో చెరువుల రక్షణలో భాగంగా ఈగల్ టీమ్ పేరుతో 16 మందికి ఉపాధి కల్పించారు.
ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా హైదరాబాద్ మహానగరంలో, జిల్లాల్లోని వివిధ కమిషనరేట్లలో కలిపి మరో 350 ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.
బాధ్యతగా వ్యవహరిస్తున్నాం
భిక్షాటన చేసుకుంటూ జీవితాలు వెళ్లదీసే వాళ్లం. ట్రాన్స్‌జెండర్లంటే ఇంతకుముందు ఎక్కడికి వెళ్లినా ఎగతాళి చేసేవారు. పని అడిగితే తిరస్కరించేవారు. కానీ ఇప్పుడు యూనిఫాం వేసుకుని విధులకు వెళ్లినప్పుడు అందరూ గౌరవంగా మాట్లాడుతున్నారు.
– తాన్షీరాయ్
