కరువు నేలపై వరద సవాలు..

కరువు నేలపై వరద సవాలు..
- వంక బ్రిడ్జిపై ప్రాణాల పణంగా ప్రయాణం
- మంత్రాలయం సమీపంలో ఉధృతంగా ప్రవహించిన వాగు
- వరద నీటిలోనే దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
- ఉత్కంఠగా వీక్షించిన స్థానికులు
నందవరం, ఆంధ్రప్రభ : నందవరం మండలం మంత్రాలయం సమీపంలో వరద నీటి ఉధృతి మధ్య ఓ ఆర్టీసీ బస్సు వంక బ్రిడ్జిని దాటిన ఘటన కలకలం రేపింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో వాగులోకి భారీగా వరద నీరు చేరి బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తుండగా, ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదే మార్గంలో ముందుకు సాగింది.
వాగు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బస్సు సురక్షితంగా దాటుతుందా లేదా అన్న ఆందోళన అక్కడ ఉన్న వారిని వెంటాడింది. బ్రిడ్జి ఇరువైపులా నిలబడ్డ స్థానికులు, వాహనదారులు ఉత్కంఠగా గమనించారు. కొంతసేపు గుండెల్లో గుబులు రేపిన ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సు నెమ్మదిగా ముందుకు కదులుతూ సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరింది.
బస్సు బ్రిడ్జి దాటిన వెంటనే ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వరద కాలంలో అప్రమత్తత అవసరం
వర్షాకాలంలో వంకలు, వాగులు, చెక్‌డ్యామ్‌లపై నీరు ప్రవహిస్తున్న సమయంలో ప్రమాదకర ప్రయాణాలను నివారించాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి లోతు, ప్రవాహ వేగం అంచనా వేయడం కష్టమవుతుందని, చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్
వరద నీరు బ్రిడ్జిపై ప్రవహిస్తున్న సమయంలో వాహనాల రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, పోలీసు పహారా పెంచడం వంటి చర్యలను మరింత సమర్థంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
“ప్రయాణం కంటే ప్రాణ భద్రతే ముఖ్యం” అనే విషయాన్ని మంత్రాలయం సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
