ఇంధన పొదుపుకు వినూత్న చర్యలు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన్ మంత్ – ఫోర్ విజిట్ కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా అమలు చేస్తూ, ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు సమిష్టిగా బస్సుల్లో ప్రయాణించడం ద్వారా వినూత్న సందేశాన్ని అందించారు. శుక్రవారం నంద్యాల జిల్లా లోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు నంద్యాల కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ ఆవరణ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఇంధన పొదుపుపై చైతన్యం పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు సందేశం ఇవ్వడానికి ముందు అధికారులు స్వయంగా ఆచరణలో చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లా, డివిజనల్, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు తమ వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, సమిష్టిగా మూడు బస్సుల్లో ప్రయాణించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఇకపై “వన్ మంత్ – ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
సంయుక్త తనిఖీలు, సమీక్షా సమావేశాలు, అధికారిక పర్యటనల సందర్భాల్లో అధికారులు విడివిడిగా వాహనాలు వినియోగించకుండా ఒకే వాహనంలో ప్రయాణించడం ద్వారా ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇటువంటి చర్యలు ప్రజల్లో కూడా ఇంధన పొదుపుపై మరింత అవగాహన పెంచేందుకు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలను తగ్గించాలని, ముఖ్యంగా సెలవు దినాల్లో వాహనాల వినియోగాన్ని పరిమితం చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అవసరమైన మేరకే ఇంధనాన్ని వినియోగిస్తూ వృథా ఖర్చులను తగ్గించుకునే దిశగా ముందుకు రావాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
