గ్రామాలలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటమే లక్ష్యం

గ్రామాలలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటమే లక్ష్యం

  • సీఐ పి.శరత్ బాబు

కారంపూడి (పల్నాడు ప్రతినిధి), ఆంధ్రప్రభ:
కారంపూడి లో శనివారం మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్ సేఫ్టీ, ఈవ్ టీజింగ్, మహిళల భద్రత పై కారంపూడి సర్కిల్ సిఐ పి.శరత్ బాబు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు కారంపూడి పద్మావతీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు సచివాలయ మహిళా కానిస్టేబుల్స్, స్థానిక మహిళలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలలో శాంతియుత వాతావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నట్లు సీఐ శరత్ బాబు తెలిపారు.

మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికి, కుటుంబాలకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అందువలన ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. గ్రామంలోని యువత ప్రవర్తన, నడవడిక తదితర అంశాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుత సమాజంలో యువత చాలా తేలికగా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నట్లు తెలిపారు. వీరిలో 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు వారు ఎక్కువగా ఉంటున్నారని వారు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడి మానసిక నియంత్రణ కోల్పోయి తమ వ్యసనాలను తీర్చుకోవడానికి నేర ప్రవృత్తి వైపు మళ్లి నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారన్నారు.

కావున తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మీ పరిసరాలలో గంజాయి మాదకద్రవ్యాలను ఎవరైనా వినియోగించిన లేదా విక్రయించిన సదరు సమాచారాన్ని దగ్గరలోని పోలీసు వారికి కానీ, 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు గాని తెలియజేయాలని తెలిపారు. “రోడ్డు భద్రత అందరి బాధ్యత – నియమాలు పాటిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం ” అంటూ ఆయన పిలుపునిచ్చారు. హెల్మెట్, సీట్‌ బెల్ట్ వాడకం పై అవగాహన కల్పించడం జరిగింది. ఓవర్‌ స్పీడ్, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వచ్చే ప్రమాదాలు గురించి వివరించారు.

అదేవిధంగా మైనర్లు ఎట్టి పరిస్థితులలో డ్రైవింగ్ చేయరాదని, పిల్లలపై ఉన్న మమకారంతో ఎవరు వాహనాలను ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలికల, మహిళల భద్రత కొరకు “శక్తి యాప్” ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ యాప్ మహిళల, బాలికల భద్రత కొరకు ప్రత్యేకంగా రూపొందించినట్లు, అత్యవసర సమయంలో మహిళలు శక్తి సాస్ యాప్ యొక్క వినియోగం గురించి తెలియజేశారు. శక్తి యాప్ ఉపయోగాల గురించి బాలికలకు, విద్యార్థులకు,మహిళలకు అవగాహన కల్పించడం కొరకు శక్తి బృందాలు స్కూలు, కాలేజీలలో కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. బాలికలపై నేరాలు, వాటి నివారణ, సంభవించిన పక్షంలో స్పందించాల్సిన తక్షణ చర్యలు, ”గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” వంటి కీలక అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. వేధింపులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన అంశాలు తెలియజేశారు. మహిళలు, బాలికలు, విద్యార్థినులు సొంతంగా తమ భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆపద సమయాల్లో పోలీస్ వారి సహాయం పొందటానికి 112 నెంబర్ లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ కు కాల్ చేసే విధంగా గ్రామాలలో అవగాహన కల్పించాలని కోరారు.

మహిళ కానిస్టేబుళ్లతో కూడిన “శక్తి బృందాల” సేవలు గురించి వివరించారు. శక్తి యాప్ ఉపయోగం గురించి సచివాలయం మహిళా కానిస్టేబుల్స్ గ్రామాలలో మహిళలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కారంపూడి మండల ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, స్టేషన్ ఇన్చార్జి ఎస్ఐ సిహెచ్. నాగార్జున, మాచర్ల టౌన్ మహిళా ఎస్సై కే.స్వర్ణ లత, సచివాలయ మహిళా కానిస్టేబుల్స్, మహిళలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply