పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 18 కోట్లు

పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 18 కోట్లు
-ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ కృషితో
-అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్
అచ్చంపేట, ఆంధ్రప్రభ:
అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అరణ్య ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన మద్దిమడుగు గ్రామంలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. పదరా మండల పరిధిలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణ అభివృద్ధి పనుల కోసం రూ. 18 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్లాన్ – ఎండిఆర్ పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆలయ పరిసర ప్రాంత అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, రహదారులు, పార్కింగ్, తాగునీటి వసతులు, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పలు పనులు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ అభివృద్ధి పనుల వెనుక స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రత్యేక చొరవ, పట్టుదల కీలకంగా నిలిచిందని భక్తులు పేర్కొంటున్నారు.
నల్లమల ప్రాంతంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేసినట్లు స్థానికులు తెలిపారు. అభివృద్ధి పనులకు అనుమతులు రావడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
భక్తులకు మరిన్ని సౌకర్యాలు
అభివృద్ధి పనులు పూర్తయితే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

