ఫ్యాక్టరీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి

ఫ్యాక్టరీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పించాలి
- జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
- జూన్ 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- కరువు సీమలో బంగారు ఫ్యాక్టరీ స్థాపించడం మన అదృష్టం: ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్
తుగ్గలి, ఆంధ్రప్రభ:
మండల పరిధిలోని పగిడిరాయి సమీపంలో ఉన్న జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టును రాష్ట్ర గనులు, భూగర్భశాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మైనింగ్ ప్రాంతాన్ని, నిర్మాణంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లను, అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ప్రమాణాలను అధికారులు, గోల్డ్ మైన్స్ నిర్వాహకులు మంత్రికి క్షేత్రస్థాయిలో వివరించారు.
వచ్చే జూన్ 27వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ గోల్డ్ మైన్స్ కర్మాగారం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో, అక్కడ చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు.
స్థానికులకు ఉపాధి, పర్యావరణ పరిరక్షణే ముఖ్యం:
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ప్రాంతీయ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్థానిక అభివృద్ధికి గోల్డ్ మైన్స్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. అలాగే, పరిశ్రమ కార్యకలాపాల నిర్వహణలో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
నియోజకవర్గ అభివృద్ధికి బాటలు:
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. కరువు సీమగా పేరొందిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం బంగారు ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టరీ స్థాపించడం మన నియోజకవర్గ ప్రజల అదృష్టమని కొనియాడారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అన్ని రంగాలలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఇదొక సువర్ణావకాశం అని పేర్కొన్నారు.
భారీగా తరలివచ్చిన నేతలు, అధికారులు:
ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త పెరవలి విశ్వనాథ్ (చిట్టెన్న), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, వాల్మీకి ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ నాయకులు పగిడిరాయి ఈశ్వర్ రెడ్డి, గిరిగేట్ల తిమ్మయ్య చౌదరి, మనోహర్ చౌదరి, సింగిల్ విండో అధ్యక్షులు అప్పా వేణుగోపాల్, మిద్దె వెంకటేష్ యాదవ్, తిరుపాల్ నాయుడు, వెంకట్రామ చౌదరి, బీసీ చంద్రశేఖర్ యాదవ్, చందోలి తిరుపాలు పాల్గొన్నారు.
అధికారుల విభాగం నుండి ఆర్‌డీఓ ఓబులేసు, తహసీల్దార్ రవి, డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐ పులి శేఖర్, ఎస్‌ఐలు మల్లికార్జున, నరేష్‌లతో పాటు గోల్డ్ మైన్స్ డైరెక్టర్ గణపతి, జీఎం బాలాజీ, పీఆర్‌ఓ బాలాజీ, గనుల శాఖ అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

