ఈవీఎం ల భద్రతపై అనుమానాలు వద్దు

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

గోదాముల డోర్ లాక్ సీళ్ల ప‌రిశీల‌న‌

నంద్యాల బ్యూరో, మే 22 ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మాసపు తనిఖీల్లో భాగంగా నంద్యాల పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డ్‌లో భద్రపరిచిన ఈవీఎంల గోదాములను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాముల డోర్ లాక్ సీళ్ల స్థితిని పరిశీలించిన కలెక్టర్, ఈవీఎంల భద్రతకు సంబంధించిన రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సమర్థవంతంగా అమలవుతున్నాయా అనే అంశాలను సమగ్రంగా సమీక్షించారు.

ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్న కలెక్టర్, గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ లాగ్‌బుక్‌ను పరిశీలించి, విధుల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ పనితీరును పరిశీలించిన కలెక్టర్, అగ్నిమాపక పరికరాల అందుబాటు మరియు వాటి పనితీరుపై సంబంధిత అధికారులను ఆరా తీశారు. డోర్ లాక్ సీళ్ల భద్రతా అంశాలను పరిశీలిస్తూ, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిరంతరం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply