“స్వర్ణ చిత్తూరు – స్వచ్ఛ చిత్తూరు” లక్ష్యంగా పనిచేద్దాం

“స్వర్ణ చిత్తూరు – స్వచ్ఛ చిత్తూరు” లక్ష్యంగా పనిచేద్దాం

  • చిత్తూరు నగర పాలక సంస్థలో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం
  • చీపురు పట్టి శుభ్రం చేసిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ: స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర స్ఫూర్తితో స్వర్ణ చిత్తూరు – స్వచ్ఛ చిత్తూరు లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. ఒక రాష్ట్రం- ఒక పరిశుభ్రత లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ నెల రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని శుక్రవారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఫారెస్ట్ రోడ్డు గంగినేని చెరువు కట్ట వద్ద ప్రారంభించారు.

ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా పరిసరాలను ఎమ్మెల్యే, కమిషనర్ పి నరసింహ ప్రసాద్, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, ఎంహెచ్వో డా.లోకేష్, స్థానిక నాయకులతో కలిసి చీపురులు పట్టి స్వయంగా శుభ్రం చేశారు. రోడ్డు పక్కన ఉన్న వ్యర్ధాలను, పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం వ్యర్థాలను చెత్త తరలించే వాహనాల్లో వేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ ను పరిశుభ్రమైన రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని.. స్వచ్ఛ సర్వేక్షన్, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రానున్న నెల రోజులపాటు పట్టణాల్లో పరిసరాలలో శుభ్రం చేయడం, ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

చిత్తూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం కోసం ప్రజాప్రతినిధులు, నాయకులు కృషి చేయాలన్నారు. నగర పరిధిలోని 50 వార్డుల్లో కూటమి నాయకులు, నగరపాలక అధికారులతో కలిసి ప్రజలను భాగస్వామ్యం చేసుకొని.. పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా చిత్తూరును స్వచ్ఛ చిత్తూరుగా మార్చాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో రెడ్, ఎల్లో జోన్లు, జన సమర్థ ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, మాజీ మేయర్ ఎస్ అముద, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.