BRS Working President | బండి భగీరథ్ కేసుపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

BRS Working President | బండి భగీరథ్ కేసుపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
రైతులు, భూదోపిడీలు, పోక్సో కేసుపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్‌ఎస్
BRS Working President | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. మైనర్ బాలికకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే తాము పోరాటం చేశామని స్పష్టం చేసిన ఆయన.. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతల వ్యవహారశైలిపై ఘాటు విమర్శలు గుప్పించారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. బండి భగీరథ్ 9 రోజుల పాటు ముఖ్యమంత్రి బంధువులకు చెందిన మెడికవర్ ఆసుపత్రిలోని 28వ అంతస్తులో దాక్కున్నాడని ఆరోపించారు.
పోక్సో కేసుపై కేటీఆర్ ఫైర్…
మైనర్ బాలికకు న్యాయం జరగాలని పోరాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని కేటీఆర్ అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ ఏమన్నా జడ్జి అనుకుంటున్నాడా? అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని తప్పుబట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ జడ్జి కాదు కానీ.. భవిష్యత్తులో నీకు పాఠాలు చెప్పే రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి అరెస్ట్ అంటూ, బండి సంజయ్ లొంగుబాటు అంటూ డ్రామాలు చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఆ అమ్మాయి మాత్రమే కాదు.. అందరూ మీ ముఖం మీద ఉమ్ముతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బండి సంజయ్ కొడుకు స్థానంలో సామాన్యుడు ఉండి ఉంటే ఇలాగే వ్యవహరించేవారా? అని ప్రశ్నించిన కేటీఆర్.. నాకు బండి సంజయ్‌తో వ్యక్తిగత పగ లేదు. ఎదురుపడితే మర్యాదగా మాట్లాడాను కూడా. కానీ అతనే నా కుటుంబం గురించి నీచంగా మాట్లాడాడు అన్నారు.
బండి సంజయ్ పోక్సో కేసులో మీడియా వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. నేషనల్ మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే తెలుగు మీడియా స్పందించింది. కొందరు హనీ ట్రాప్ అంటూ బాధితురాలిని అవమానించేలా కథనాలు రాశారు అని మండిపడ్డారు. ప్రధానమంత్రి వస్తే నేరస్తులకు సెలవులు ఇస్తారా? 9 రోజులు పోక్సో కేసు నిందితుడిని దాచిపెట్టిన చరిత్ర దేశంలో ఎప్పుడైనా చూశామా? అని డీజీపీ వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నా కొడుకు కేసులో నా పేరు వాడొద్దని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకునే రకం కాదు నేను. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై ఆరోపణలు..
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 45 రోజుల్లో 10 మంది రైతులు చనిపోతే ఒక్కరు కూడా చనిపోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 35 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. కానీ 50 శాతం కొనుగోలు చేశామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేదని విమర్శించారు. ఏ ఊరికైనా పోదాం.. మీరు చెప్పినట్లు 80శాతం కొనుగోళ్లు జరిగాయని నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
భూదోపిడీలపై సంచలన ఆరోపణలు…
రాష్ట్రంలో భూ దోపిడీలు జరుగుతున్నాయని ఆరోపించిన కేటీఆర్.. మీకు భూ దోపిడి మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. కేసముద్రంలో అసైన్డ్ భూముల ఆక్రమణలు జరిగాయని, శంషాబాద్‌లో ముఖ్యమంత్రి అనుచరులు 90ఎకరాల సీలింగ్ భూమిని దోపిడీ చేశారని ఆరోపించారు. ఎంఆర్ఓ, కలెక్టర్ స్థాయిలో ఉత్తర్వులు ఇచ్చి వేల కోట్ల భూములను కాజేశారని, ఇటీవల ఏసీబీ దాడుల్లో అవి బయటపడ్డాయని కేటీఆర్ పేర్కొన్నారు.
CLICK HERE TO READ Court Verdict | 130వ రాజ్యాంగ సవరణ బిల్లు చుట్టూ రాజ్యాంగ, న్యాయ, రాజకీయ చర్చలు
