అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ..

అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ..

సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేయండి..
​బక్రీద్ నేపథ్యంలో మూగజీవాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
​24/7 అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశం

నిజామాబాద్ (క్రైమ్ ప్రతినిధి) ఆంధ్రప్రభ : రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకొని అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘాను మరింత పటిష్టం చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. అధికారులను ఆదేశించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందకుర్తి అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌తో పాటు జాన్కంపేట, పాల్ద జన్నాపల్లి చెక్‌ పోస్టులను ఆకస్మికంగా సందర్శించి, తనిఖీలను స్వయంగా పరిశీలించారు. ​ఈ సందర్భంగా విధుల్లో ఉన్న అధికారులకు, సిబ్బందికి సీపీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మహారాష్ట్ర సరిహద్దు నుంచి మూగజీవాల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్నందున చెక్‌పోస్టుల వద్ద 24/7 ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. నిషేధిత పదార్థాలు, అక్రమ నగదు రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల పై నిరంతరం తనిఖీలు చేపట్టాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. అవసరమైన చోట ఆధునిక సాంకేతిక పరికరాల సహాయం తీసుకోవాలన్నారు.

​ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలి..
వాహనాల తనిఖీ సమయంలో ప్రజలతో ఎంతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సీపీ సిబ్బందికి సూచించారు. రాత్రి వేళల్లో విధుల్లో ఉండే సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండటంతో పాటు, ఆత్మరక్షణ కోసం తప్పనిసరిగా రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించాలని, భద్రతా పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో చెక్‌పోస్టులు కీలక పాత్ర పోషిస్తాయని, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో సీపీ వెంట స్పెషల్ పార్టీ సిబ్బంది, స్థానిక పోలీసులు ఉన్నారు.

Leave a Reply